అధికార కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులే పాల్గొనాలి. మ‌హిళ‌లు అయితే వారే త‌మ పాత్ర‌కు న్యాయం చేయాలి. కానీ మ‌న‌దేశంలో మ‌హిళ‌లు కొడుకు చాటు త‌ల్లులు గానో లేదా భ‌ర్త చాటు భార్య‌ల గానో రాజ‌కీయాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు అనేక గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నారు. రిజ‌ర్వేష‌న్ల పుణ్య‌మా అంటూ మ‌హిళ‌లు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న చోట మహిళమణులు మాత్రం రబర్‌స్టాంప్‌గా మిగిలిపోతున్నారు. 


తాజాగా బిహార్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న ప్ర‌జాస్వామ్యంలో మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధుల‌కు విలువ లేకుండా చేస్తోంది. పాట్నా మేయ‌ర్‌గా ఉన్న మ‌హిళ కుమారుడు ఓ మ‌హిళా కౌన్సెల‌ర్‌ను వేధించి వార్త‌ల్లోకెక్కాడు. బీహర్ రాజధాని పాట్నా మున్సిపాలిటీకి మేయర్‌గా సీత సాహు పనిచేస్తున్నారు. ఆమెకు శిశిర్ కుమార్ అనే కుమారుడు ఉన్నారు. మున్సిపాలిటీకి సంబంధించి అన్నీ పనులు చక్కబెడుతుంటాడు. 


చివ‌ర‌కు ఆ పుత్ర‌ర‌త్నం పాల‌న వ్యవ‌హారాల్లోనూ మితిమీరి జోక్యం చేసుకుంటాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల పాట్నాలో మునిసిప‌ల్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో మున్సిప‌ల్ మేయ‌ర్‌, కౌన్సెల‌ర్లు, క‌మిష‌న‌ర్‌, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మేయర్ కుమారులు, భర్తలు రాకూడదు. కానీ మేయర్ కుమారుడు శిశిర్ సమావేశానికి వచ్చాడు. అక్కడ అజెండాపై చ‌ర్చ జ‌రుగుతుండ‌గా 21వ వార్డు కౌన్సెల‌ర్ పింకీ కుమారీ తన వార్డులో ఉన్న ఇబ్బందులను చెపుతున్నారు. 


వెంట‌నే మేయ‌ర్ కుమారుడు ఆమె వైపు చూస్తూ క‌న్ను కొట్ట‌డంతో ఆమె అవాక్క‌య్యారు. త‌ర్వాత ఈ విష‌యాన్ని శిశిర్ తల్లి, మేయర్‌ సీత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కుమారుడిని హెచ్చ‌రించాల్సింది పోయి.. కొడుకుని వెన‌కేసుకు వ‌చ్చారు. మేయ‌ర్ కూడా కొడుకునే వెన‌కేసుకు రావ‌డంతో పింకీ త‌న బాధ ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క కుమిలిపోయారు.


స‌మావేశంలో త‌న వార్డు అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌శ్నించినందుకే వారు త‌న‌పై ప‌గ ప‌ట్టార‌ని పింకీ కుమారి వాపోయింది. ఈ అంశాన్ని బీహర్ సీఎం నితీశ్ కుమార్ దృష్టికి కూడా తీసుకెళతానని స్పష్టంచేశారు. తనతో అనుచితంగా ప్రవర్తించిన శిశిర్‌పై కడమ్‌కువ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: