ఆమె దేశంలోనే ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి. ప్రాంతీయ రాజ‌కీయాల్లోనే కాదు... జాతీయ రాజ‌కీయాల్లో సైతం ఫైర్‌బ్రాండ్‌. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని, దశాబ్దాల పాటు కార్యకర్తల అండ ఉన్న సీపీఎం పార్టీని మూడు చెరువుల నీళ్లు తాగించిన నాయకురాలు. ముఖ్య‌మంత్రిగా ఉన్నా ఆమె సామాన్య‌మైన జీవ‌న‌విధానం దేశ‌వ్యాప్తంగానే కాదు... ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమందిని ఆక‌ర్షించ‌డంతో పాటు ఆమెను నిజ‌మైన హీరోను చేసింది. ఇంత‌కు ఆమె ఎవ‌రో కాదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అందరూ ముద్దుగా పిలుచుకునే ‘దీదీ’.


కేవ‌లం రాజ‌కీయాల్లోనే కాదు... జీవ‌న విధానంలోనూ మ‌మ‌త‌ది అసాధారణ శైలి. ముఖ్యమంత్రి అంటే ఎంత మందీ మార్బ‌లం ఉండాలి ?  ఆమె చుట్టూ స‌క‌ల హంగులు ఉన్నా ఆమె మాత్రం అత్యంత సామాన్య‌మైన జీవ‌నాన్నే కొన‌సాగించేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. తాజాగా ఆమె బెంగాల్‌లో ఓ వీథిలో చేసిన ప‌నికి రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రూ ఫిదా అయిపోయారు.  ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజధాని ద‌గ్గ‌ర‌గా ఉన్న దీఘా సమీపంలోని దత్తాపూర్ కు వెళ్లారు.


అక్క‌డ నుంచి తిరుగు ప్ర‌యాణంలో ఆమె ఓ కిరాణ షాపు ద‌గ్గ‌ర త‌న వాహానాన్ని ఆపేశారు. సెక్యూరిటీ సిబ్బందిని వారించి ఆమె ప‌క్క‌నే ఉన్న ఓ కిరాణా షాపులోకి న‌డుచుకుంటూ వెళ్లిపోయారు. వెంట‌నే స్థానికులు ఆమెను చుట్టుముట్టారు. ఆ దుకాణాదారుడితో కొద్దిసేపు ముచ్చ‌టించిన మ‌మ‌త అక్క‌డ ఓ మ‌హిళ వొళ్లో ఉన్న చిన్నారిని ఎత్తుకుని ఐదు నిమిషాల పాటు ఆడించారు. ఆమె ద‌గ్గ‌ర‌కు సెక్యూరిటీ సిబ్బంది వెళ్లేందుకు ప్ర‌య‌త్నించినా రావద్దంటూ వారించారు.


అక్క‌డ తానే స్వ‌యంగా టీ క‌లిపి తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌ల‌కు స్వ‌యంగా ఇచ్చారు. ప‌క్క‌న కొంద‌రు ఆమెకు స‌హ‌క‌రించేందుకు వ‌చ్చినా ఆమె సున్నితంగా తిర‌స్క‌రించారు. అక్కడ దాదాపు అరగంట గడిపిన మమతా బెనర్జీ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె సింపుల్ సిటీపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: