ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు పడుగుతున్నాయి. మద్యం కొత్త విధానం, నిబంధనల గురించి జీవోలు జారీ అయ్యాయి. మద్యపాన నిషేధం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 800 మద్యం దుకాణాలను ఈ సంవత్సరం తగ్గించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల సమయం వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. 
 
ప్రతి జిల్లాలో ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ సహాయంతో డీ - అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి మద్యం సేవించేవారికి కౌన్సిలింగ్ ఇచ్చి తాగుడు మానేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులకు 100 మీటర్ల లోపు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయకూడదు. ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలంటే గ్రామసభ అనుమతితో పాటు గ్రామసభ నుండి నిరభ్యంతర ధృవీకరణ పత్రం కచ్చితంగా ఉండాలి. 
 
మద్యం సేవించటం వలన కలిగే దుష్పరిణామాల గురించి ప్రజల యొక్క సహకారంతో భారీ స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టబోతుంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం మద్యం కొత్త పాలసీకి సంబంధించిన రెండు వేరు వేరు జీవోలను జారీ చేసింది. మద్యం మత్తులో ఉన్నవారికి, 21 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారికి, యునిఫాం ఉన్న సైనికులకు మద్యం విక్రయించరాదు. 
 
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి యొక్క పవిత్రతను కాపాడేందుకు తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి అలిపిరి వరకు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా నిబంధనలు రూపొందించారని సమాచారం. మద్యం దుకాణాలకు ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితిగా నిర్ణయించారు. మద్యం కొత్త విధానంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: