ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డులతో ఈకేవైసీ అనుసంధానం చేయటం కొరకు గడువు పెంచింది. 15 సంవత్సరాల వయస్సు కంటే ఎక్కువ ఉన్నవారికి సెప్టెంబర్ 5 వ తేదీ వరకు గడువు పెంచారు. 15 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారికి సెప్టెంబర్ 15 వ తేదీ వరకు గడువు పెంచారు. మొదట ఆగస్టు 20 వ తేదీ దాకా ఈకేవైసీ అనుసంధానం కొరకు గడువు విధించగా వివిధ సమస్యలతో ఈకేవైసీ అనుసంధానం చాలా చోట్ల ప్రజలు పూర్తి చేసుకోలేదు. 
 
ఈ పాస్ మెషిన్లు సరిగ్గా పనిచేయకపోవటం, వేలిముద్రలు మ్యాచ్ కాకపోవటం వలన చాలా చోట్ల ప్రజలు ఇంకా ఈకేవైసీ అనుసంధానం చేసుకోలేదు. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఈకేవైసీ అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రెండూ కలిసి 15 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు పాఠశాలల్లోనే ఈకేవైసీ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తుంది. 
 
రేషన్ కార్డులకు ఈకేవైసీ చేయించుకోవాలనే నిబంధనతో ప్రజలు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాల లబ్ధి పొందటానికి అర్హులు కారని వార్తలు వినిపించటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రంలో 750 కేంద్రాలు మాత్రమే ఉండటంతో ఆధార్ కార్డులలో ఏవైనా మార్పులు చేయించుకోవాలంటే ఆలస్యం అవుతుంది. 
 
5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలకు వేలిముద్రలు లేకుండానే ఆధార్ కార్డ్ ఇస్తున్నారు. 5 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత వేలిముద్రలు నమోదు చేసి ఈకైవైసీ చేసుకోవాలి.ఈకేవైసీ అనుసంధానం ద్వారా రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న వారెవరో రేషన్ కార్డులు లేనివారెవరో సమాచారం తెలుస్తుందని. దీని ద్వారా కొత్త రేషన్ కార్డులను అర్హులకు ఇవ్వటం సులువు అవుతుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు.  ప్రస్తుతం ఈకేవైసీ అనుసంధానం కొరకు గడువు పెంచటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: