పొరుగు దేశ‌మైన‌ పాకిస్థాన్ త‌న ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను ఆపివేయ‌డం లేదు. ఆర్టికల్‌ 370 రద్దుతో మండిపోతున్న పాక్ భార‌త‌దేశంలో ఉద్రిక్త వాతావరణాన్ని నెల‌కొల్పేందుకు ఇంకా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తోంది. ఇందుకోసం ప్ర‌త్యేక దారుల‌ను అన్వేషిస్తోంది. పాక్ నుంచి చొర‌బాట్లు జ‌రిగితే ప‌ట్టుబ‌డే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో శ్రీ‌లంక నుంచి ఈ మేర‌కు ప్ర‌య‌త్నిస్తోంది. త‌మిళనాడులోకి ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు చెన్నైతో పాటు ప్రధాన ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మ‌రోవైపు పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ ప్రేరేపిత అఫ్ఘానిస్థాన్‌ మిలిటెంట్లు దాడులకు తెగబడే అవకాశముందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.  దీంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది.


రాష్ట్రంలోకి ఆరుగురు ఉగ్రవాదులు చొరబడినట్లు తమకు సమాచారం అందిందని త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన‌ ఓ సీనియర్ పోలీసు అధికారి జాతీయ మీడియాతో వెల్ల‌డించారు. ``మాకు అందిన స‌మాచార మేర‌కు తమ పోలీసు బలగాలను అప్రమత్తం చేశాం. తమిళనాడులోని ప్రధాన నగరాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నాం. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను అప్రమత్తం చేశాం` అని తెలిపారు. మ‌రోవైపు చెన్నై, కోయంబత్తూరులోని హోటల్స్, రైల్వేస్టేషన్స్, థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌తో పాటు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఇదిలాఉండ‌గా, పాకిస్థాన్ లో ఈ నెల 19,20 తేదీల్లో జైషే మహ్మద్ కమాండర్ల సమావేశంలో ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ తోపాటు అతని సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్ఘర్ లు సమావేశమై దాడులకు వ్యూహరచన చేసినట్టు భార‌త‌వ‌ర్గాల‌కు సమాచారం అందింది. ఈ నేప‌థ్యంలో లిపా లోయ నుంచి యూరి, తంగధర్ సెక్టార్ల మీదుగా ఆఫ్ఘాన్ మిలిటెంట్లు కశ్మీర్ లోకి చొరబడి దేశంలోని కశ్మీర్ లోయతో పాటు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రల్లో దాడులకు ప్లాన్‌ చేసినట్టు ఐబీ హెచ్చరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: