అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంట్లో దొంగతనం ఘటన అనేక ట్విస్టులు తిరుగుతోంది. అసలు దొంగతనం జరిగిందా లేదా అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ ను  తన ఇంట్లోను, క్యాంపు కార్యాలయంలోను కోడెల వాడుకున్న విషయం తెలిసిందే. ఆ విషయం బయటపడటంతో కోడెలకున్న కాస్త పరువు కూడా రోడ్డుపై పడిపోయింది.

 

నరసరావుపేట, సత్తెనపల్లి ఇంట్లోను, క్యాంపు కార్యాలయంలోని మాజీ స్పీకర్ ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ను స్వాధీనం చేసుకునేందుకు అసెంబ్లీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళాలని నిర్ణయించారు. అదే విషయాన్ని కోడెలకు సమాచారం కూడా అందించారు. అయితే హఠాత్తుగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కోడెల ఇంట్లో దొంగతనం జరిగింది. రెండు కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్ళారు. ఈ విషయం బయటపడగానే పెద్ద సంచలనంగా మారింది.

 

అయితే ఇక్కడే మరో ట్విస్టు కూడా మొదలైంది. అదేమిటంటే ఇంట్లోని వాచ్ మెన్ ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట ప్రాంతంలో దొంగతనం జరిగింది. కానీ సత్తెనపల్లి మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఒకరు రాత్రి 11 గంటల ప్రాంతంలోనే పోలీసు స్టేషన్ కు ఫోన్ చేసి కోడెల ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పటం విచిత్రంగా ఉంది. వాచ్ మెన్,  మాజీ ఛైర్మన్ ఇద్దరిలో ఎవరు చెబుతున్నది నిజమో తెలీక పోలీసులు తలలు పట్టుకున్నారు.

 

అయితే వీటికి అదనంగా మరో సూపర్ ట్విస్టు జరిగింది. అదేమిటంటే తమ ఇంట్లో దొంగతనం జరగలేదంటూ కోడెల కుటుంబీకులు చెబుతున్నారు. తమ ఇంట్లో కంప్యూటర్లను ఎవరూ దొంగతనం చేయలేదని తాజాగా చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దొంగతనం విషయంలో మూడు రకాల వాదనలు వినిపిస్తుండటంతో అసలు ఏది కరెక్టో తేల్చుకోలేక పోలీసులే అయోమయానికి గురవుతున్నారు. అసలు జరుగుతున్న మొత్తం ఎపిసోడ్ కోడెలకు తెలీకుండానే జరుగుతుందా ? అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: