తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మరోసారి తెలియని గ్యాప్ ఏర్పడిందని టీఆర్ ఎస్ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమం మొదలు కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు హరీష్ రావు. సాగు నీటి పారుదలశాఖ మంత్రిగా ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మిషన్ కాకతీయ పనులని పరుగులు పెట్టించారు. ఈలోపు తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.



ఈ సారి కూడా హరీశ్ రావుకు నీటిపారుదల శాఖ ఖాయమన్న చర్చ అప్పట్లో సాగింది. దీనికి భిన్నంగా కేసీఆర్ ఊహించని షాకిచ్చారు. రెండోసారి అధికారం లోకొచ్చిన తర్వాత మంత్రి వర్గ ఏర్పాటులో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.చాలా మంది పాత మంత్రులకు ఝలక్ ఇవ్వగా హరీష్ రావు సైతం షాక్ కు గురికాక తప్పలేదు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లు కనిపించింది. ఈ క్రమంలో హరీష్ రావు సిద్దిపేటకే పరిమితం అయ్యారు.



లోకసభ ఎన్నికల్లో పదహారు స్థానాలు తమవే అనుకున్న టీ ఆర్ ఎస్ పార్టీ షాక్ కు గురికాక తప్పలేదు. హరీశ్ రావుల ట్రబుల్ షూటర్ ను రాష్ట్రస్థాయిలో ఉపయోగించుకున్న కారణంగానే ఈ ఫలితాలొచ్చాయని గులాబీ పార్టీ నేతలు అప్పట్లో తెగ చెవులు కొరుక్కున్నారు. దీనితో హరీశ్ రావును పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడారంటూ తెగ ప్రచారం సాగింది. అనంతర పరిణామాల క్రమంలో చింతమడకలో నిర్వహించిన పలు కార్యక్రమాలను అన్ని తానై చూసుకున్నారు హరీశ్ రావు.



ఆ సందర్భంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉన్నట్టు కనిపించింది. గత ఎన్నికల సమయంలో నుంచి వస్తున్న గ్యాప్ ఇక తగ్గిపోయినట్లే అని ఆ పార్టీలో చర్చ కూడా సాగింది.కాని తాజా పరిణామాలు చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానాలకు బలం చేకురుతుంది అంటున్నాయి టిఆర్ ఎస్ వర్గాలు. రెండు రోజుల క్రితం కేసీఆర్ గజ్వేల్ పర్యటనలో హరీశ్ రావు కనిపించకపోవడం గులాబీ పార్టీలో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ప్రోగ్రాంలో మాజీ మంత్రి తాజా సిద్దిపేట ఎమ్మెల్యేకు ఆహ్వానం అందకపోవడంపై అనుమానాలకు బలం చేకూరుస్తుంది.




స్థానిక నేతలెవరినీ పిలవలేదు.కేవలం కలెక్టర్లే హాజరయ్యారు అనుకున్నా ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి లాంటి ప్రోటోకాల్ లేని నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు తరచూ ఫామ్ హౌస్ కు వెళ్లే హరీశ్ రావు ఈ మధ్య కాలంలో వెళ్లడం లేదు. మొత్తంగా కేసీఆర్, హరీశ్ రావు మధ్య గ్యాప్ స్పష్టంగా ఏర్పడుతుందా అన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతుంది. మంత్రివర్గ విస్తరణ జరిగినా హరీశ్ రావుకు చోటు లభిస్తుందా లేదా అనే విషయం కూడా అనుమానంగానే కనిపిస్తోందంటున్నారు పార్టీ నేతలు. ఇంతకి హరీశ్ రావు కేసీఆర్ కు ఎక్కడ చెడిందన్న విషయం మాత్రం పొలిటికల్ వర్గాలకు అంతుచిక్కడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: