ఏపీ సర్కారు వరద నిర్వహణలో వైఫల్యాన్ని మాజీ ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. విజయవాడలోని తన ఇంటిని ముంచేందుకే రాష్ట్రప్రభుత్వం వరదలను సరిగ్గా కంట్రోల్ చేయలేదంటూ విమర్శించారు. చంద్రబాబు విమర్శలపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు ఎన్నటికి నిజాలు చెప్పరని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.


తాను చంద్రబాబు ప్రెస్ మీట్ మొత్తం చూశానని అన్నారు. చంద్రబాబు ఒక్క నిజం అయినా చెబుతారేమోనని ఎంతో ఆశపడి చూశానని.. కానీ తనకు నిరాశే ఎదురైందని అనిల్ యాదవ్ కామెంట్ చేశారు. చంద్రబాబు ఎంతసేపు కరకట్ట మీద కట్టుకున్న తన ఇల్లు ఎలా మునిగిపోయిందనేదే ఆందోళన తప్ప ఇంకొటి లేదని అనిల్ అన్నారు.


అనిల్ కుమార్ యాదవ్ ఇంకా ఏమన్నారంటే..

" చింత చచ్చినా పులుపు చావలేదనేది సామెత. చివరకు వరదల్లో కూడా హైటెక్‌ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు. మైకేల్‌ జాక్సన్‌ మైకు... పవర్‌ పోయిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌... ఇదీ చంద్రబాబు ప్రెస్‌మీట్‌ .. చంద్రబాబు ఎంతసేపు మాట్లాడినా నా ఇల్లు ముంచేయడానికే అంటున్న చంద్ర బాబు వాస్తవానికి అయిదేళ్ల పాలనతో తన కొంప, తన పార్టీ, తనను నమ్ముకున్న కార్యకర్తల కొంప ఏప్రిల్‌లోనే ముంచేశారు. ఎడారి నడుమ ఇల్లు కట్టుకుని నీళ్లు ఇవ్వలేదని ఎవరన్నా ఏడిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో...రిజర్వాయర్‌ మధ్య ఇల్లు కట్టుకుని తన ఇల్లు ముంచేశారని ఎవరన్నా ఏడిస్తే అంతే హాస్యాస్పదంగా ఉంటుంది..అంటూ అనిల్ కుమార్ యాదవ్ వెటకారం ఆడారు.


చంద్రబాబు ప్రెస్ మీట్ కూడా చూసేవారికి నమ్మశక్యంగా లేదు. కేవలం చంద్రబాబు ఇంటిని ముంచడం కోసం వైసీపీ కృత్రిమంగా వరదలను సృష్టించిందని చంద్రబాబు వంటి సీనియర్ నేత విమర్శలకు దిగడం అంత సబబుగా అనిపించడం లేదని విమర్శకులు కామెంట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: