జగన్మోహన్ రెడ్డిపై కేంద్రప్రభుత్వం సీరియస్ అయినట్లే వార్తలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రీ టెండరింగ్ పై కేంద్రం బాగా సీరియస్ అయ్యిందట. కేంద్రప్రభుత్వం అందిస్తున్న నూరుశాతం నిధుల సాయంతో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్రప్రభుత్వం తనిష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకునేందుకు లేదని కేంద్రం ఆంక్షలు విధించింది.

 

మొత్తానికి జగన్ నిర్మాణ వ్యయాన్ని తగ్గించటం, పారదర్శకంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని అనుకుంటే ఆచరణలోకి వచ్చేటప్పటికి ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేయగానే కాంట్రాక్టు సంస్ధ నవయుగ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. దాంతో జగన్ ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైంది.

 

కోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజే కేంద్రం కూడా జగన్ పై సీరియస్ అయ్యింది. అంటే జరిగినది చూస్తుంటే రాజకీయంగా తెరవెనుక ఏదో జరుగుతోంది అన్న విషయం అర్ధమైపోతోంది. నిజానికి నిధులు అందిస్తున్న కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రప్రభుత్వం ఏమీ చేయకూడదన్నది వాస్తవమే. కానీ రివర్స్ టెండరింగ్ విషయంలో జగన్ ఉద్దేశ్యాన్ని కేంద్రం ఎందుకు విస్మరిస్తోందన్నదే తెలియటం లేదు.

 

తన ఉద్దేశ్యాలను జగన్ ముందుగానే కేంద్రానికి తెలియజేసి వాళ్ళ ఆమోదం తీసుకుని ఉంటే బాగుండేదనే వాదన కూడా పార్టీలో ఇపుడు మొదలైంది. జగన్ ఆలోచన వర్కవుటైతే నిజానికి లాభపడేది కేంద్రమే. ఖర్చులు తగ్గితే లాభపడేది కేంద్రమే కదా ? అయినా కానీ జగన్ ఆలోచనను వ్యతిరేకిస్తోందంటే అర్ధమేంటి ?

 

ఇక్కడే తెరవెనుక జరుగుతున్న పరిణామాలపైనే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. పోలవరం రివర్స్ టెండరింగ్ కు జగన్ వెళ్ళటం ఇటు చంద్రబాబునాయుడు, అటు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరికీ ఇష్టం లేదు. ఈ నేపధ్యంలోనే జగన్ కు వ్యతిరేకంగా రెండు పార్టీలు ఏకమయ్యాయా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి  ఈ విషయాన్ని జగన్ జాగ్రత్తగా గమనించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేట్లు లేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: