ఏపీ సీఎం జగన్ కేంద్రంతో మంచి సంబంధాలే నిర్వహిస్తున్నాడు.. ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా సరే.. కేంద్రంలోని పెద్దలతో రిలేషన్లు బాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఎదగాలని భావిస్తున్నా.. అది కేంద్రం-జగన్ సంబంధాలపై పెద్దగా ప్రభావం చూపడం లేదు.


ఈ విషయాన్ని మొన్నే విజయసాయి రెడ్డి ఎలాంటి శషభిషలూ లేకుండా కుండ బద్దలు కొట్టేసాడు. జగన్ ఎలాంటి కీలక నిర్ణయాలైనా సరే కేంద్రంలోని మోడీ, అమిత్ షాలకు చెప్పే చేస్తున్నాడు.. వాళ్ల ఆశీస్సులు జగన్ కు ఉన్నాయని అని బాహాటంగానే చెప్పేశాడు. ఇంతకు మించి వేరే నిదర్శనాలు ఎందుకు.


అయినా సరే కొందరు అనుమానిస్తూనే ఉంటారు. అలాంటి వారి కోసం ఇంకో ఉదాహరణ కూడా దొరికింది. అదేంటంటే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగు ప్రాధాన్యత ఇస్తున్నారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలలో ఒక వార్త వచ్చింది. దేశస్థాయిలో ఉండే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కొత్తగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు ఆ వార్తలో తెలిపారు.


ఈ కమిటీలో జగన్ తో పాటు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్క జగన్ కు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. కేసీఆర్ ను కూడా పట్టించుకోలేదు. రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం, సహకార ఫెడరలిజం వంటి అంశాలపై ఈ కమిటీ సిఫారసులు చేస్తుంది. ఇలాంటి కీలక కమిటీలో అదీ చాలా తక్కువ సభ్యులున్న కమిటీలో జగన్ కు చోటు కల్పించడం అంటే బీజేపీ జగన్ కు చక్కటి ప్రయారిటీ ఇస్తున్నట్టే కదా.. ఏమంటారు..?


మరింత సమాచారం తెలుసుకోండి: