భార్యాభర్తలన్నాక ఎన్నో తగాదాలు వస్తుంటాయి. పోతుంటాయి.. అన్నీ సర్దుకుపోవాలంటారు.. కానీ అసలు భర్త ఏ తప్పూ చేయకపోతే.. భార్యను బంగారంలా చూసుకుంటే.. అబ్బ ఎంత మంచి మొగుడో అనుకుంటారు ఇరుగు పొరుగు ఆడాళ్లు.. కానీ అలా ఉంటే.. ఓ భార్యకు మాత్రం అస్సలు నచ్చడం లేదట.. మరీ ఇంత మంచి మొగుడా నాకొద్దు.. నాకు విడాకులు ఇప్పంచండి అంటూ కోర్టు కెక్కిందట.


ఈ విచిత్ర ఘటన అబుదాబిలో చోటు చేసుకుంది. భర్త అతి ప్రేమతో తనకు ఊపిరాడటం లేదని.. విడాకులు ఇప్పించాలంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించి అందరిని ఆశ్చర్యపరిచింది. యూఏఈ లోని షరియత్ కోర్టుకు ఒక విడాకుల కేసు వచ్చింది. అయితే ఆ కేసు వివరాలు చదివి ఆశ్చర్యపోవడం జడ్జి వంతయ్యింది. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని జడ్జి ప్రశ్నించారు. అందుకు ఆమె ‘అసలు నా భర్త ఏ విషయంలోనూ నాతో గొడవపడడు. ఇంటిని సరిగా ఉంచకపోయినా, వంట బాగా చేయకపోయినా ఏమి అనడు.


పైగా అప్పడప్పుడు తనే నాకు వండి పెడుతుంటాడు. ఇంటిని కూడా శుభ్రం చేస్తాడు, అంట్లు కడుగుతాడు, బట్టలు కూడా తానే వాషింగ్ మెషిన్లో వేసి ఆరేస్తాడు. నాకు పనేం చెప్పకపోగా బహుమతులతో నన్ను ముంచెత్తుతాడు. నాకు మా ఆయనతో గొడవ పడాలని, వాదించాలని ఉంటుంది. కానీ నేనేం చేసినా సరే తను ప్రేమతో క్షమిస్తూ ఉంటాడు. ఆయన అతి ప్రేమతో నాకు ఊపిరాడటం లేదు.


అసలు గొడవలు లేకుండా జీవించడం నాకు నరకంలా ఉంది. ఇలాంటి జీవితం నాకు వద్దు. విడాకులు ఇప్పించండి’ అని పేర్కొంది. వాదనలు విన్న జడ్జి.. ఇది కోర్టులో విచారించదగిన కేసు కాదని.. దంపతులిద్దరూ కలసి కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: