మూడ్రోజులుగా లష్కరె తోయిబా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని వార్తలు అందుతూనే ఉన్నాయి. ఈ వార్త‌ల‌తో దేశ‌వ్యాప్తంగా ఒక్క‌సారిగా తీవ్ర క‌ల‌క‌లం రేగుతోంది. ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌తి రాష్ట్ర పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి. ఉగ్ర‌వాదుల ఏ ప్రాంతాల‌ను టార్గెట్‌గా పెట్టుకున్నారో ?  కూడా చెపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉగ్ర‌వాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి వచ్చారని సమాచారం. శుక్రవారం సాయంత్రానికి మరో హెచ్చరిక జారీ అయింది. 


సెంట్రల్ ఇంటిలిజెన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి దక్షిణాది రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేశారు. దీంతో జన సంచారం అధికంగా ఉండే ప్ర‌ముఖ ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తిని కూడా టార్గెట్ చేయ‌వ‌చ్చ‌న్న అనుమానాలు ఇంటిలిజెన్స్ వ్య‌క్తం చేస్తోంది. ఉగ్రవాదులు చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తిలో చొరబడే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 


చిత్తూరు జిల్లా పోలీసులు ప్ర‌తి క్ష‌ణం అలెర్ట్‌గా ఉంటున్నారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేయనున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్‌, ఇండ‌స్ట్రీలు ఇలా ప్ర‌తి చోటా విస్తృతంగా త‌నిఖీలు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు నుంచి అనుమానిత వస్తువులు తీసుకోవద్దని, సందేహంగా అనిపిస్తే వెంటనే లోకల్ పోలీసులకు 100, 8099999977 నంబర్ల ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. 


రేణిగుంట ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లోకి వచ్చే వారి పాస్‌పోర్టులు తనిఖీ చేస్తున్నారు. న‌గ‌రం మొత్తం డేగ క‌ళ్ల‌తో ప‌రిశీలిస్తున్నారు. నగర ప్రవేశ ప్రాంతాల వద్ద వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ, అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నారు. ఇక పుణ్య‌క్షేత్రంలోనూ నిఘా భారీగా ఉంది. తిరుమల, తిరుపతితో పాటు తిరుచానూరు, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టు ప్రాంతాలు, ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాల్లో సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: