జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా రాజ‌కీయ ర‌గ‌డ కొన‌సాగుతోంది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు స‌మ‌యంలో...రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు భారీగా బలగాలను మోహరించడంతోపాటు ఆంక్షలను కూడా విధించింది. రాష్ట్ర రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ప్రతిపక్ష నేతలు శనివారం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు. అయితే, క‌శ్మీర్‌లో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు కొన‌సాగుతుండ‌టాన్ని వీక్షించేందుకు వెళుతున్న నేత‌ల ప‌ర్య‌ట‌నలో హైడ్రామా నెల‌కొంది. 


ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే పార్టీలకు చెందిన నేత‌లు ప్ర‌యాణం మొద‌లుపెట్టే స‌మ‌యంలో... ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది.  కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో విప‌క్షాల బృందంలో టీఎంసీ, సీపీఐ, ఆర్జేడీ, ఎల్‌జేడీ, సీపీఐ, డీఎంకే, ఎన్సీపీ, జ‌న‌తాద‌ళ్‌, ఎస్పీ నేత‌లైన గులాం న‌బీ ఆజాద్‌, సీతారం ఏచూరి, డీ రాజా, మ‌నోజ్ జా, ఆనంద్ శ‌ర్మ‌, మ‌జీద్ మీమ‌న్‌, వేణుగోపాల్‌, తిరుచి శివ‌, శ‌ర‌ద్ యాద‌వ్‌, దినేశ్ త్రివేదిలు ఉన్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల వ్యూహం ప్ర‌కారం ఈ బృందం తొలుత శ్రీనగర్‌ను సందర్శిస్తుంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు వెళ్లడానికి అధికారులు అనుమతిస్తే ఆయా ప్రాంతాల్లోనూ పర్యటిస్తుంది. 


వీరికి క‌శ్మీర్‌ రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో దిగ‌గానే వారిని అరెస్ట్ చేసే అవ‌కాశాలు ఉన్నట్లు స‌మాచారం. ప్రతిపక్ష నేతలు కశ్మీర్‌లో పర్యటించడం వల్ల శాంతికి విఘాతం కలిగే అవకాశముందని, కాబట్టి పర్యటనకు రావొద్దని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం సూచించింది. ``ఇప్పుడిప్పుడే కశ్మీర్‌లో శాంతి క్రమంగా నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు కశ్మీర్‌లో పర్యటిస్తే శాంతికి విఘాతం కలిగే అవకాశముంది. కాబట్టి నాయకులు ఇక్కడికి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం`` అని అధికారులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: