ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో భారత పై ఆగ్రహంతో రగిలిపోతున్న పాకిస్తాన్ అసహనంతో రగిలిపోతోంది. అంతర్జాతీయ వేదికపై  భారత్ ను దోషిగా చూసించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడంతో... దిక్కుతో తోచని స్థితిలో ఉన్న దాయాది దేశం.. ఏం చేయాలో పాలుపోక ఉగ్రమూకలను ఉసిగొల్పుతోంది. ఇలా పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు గత కొన్ని రోజులుగా భారత్ లో దాడులకు తెగబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చైన్నైలో ఉగ్రకలకలం రేగడంతో భారత హోంశాఖ మరింత అప్రమత్తమైంది.


లష్కరే తోయిబాకు చెందిన టెర్రరిస్టులు శ్రీలంక ద్వారా తమిళనాడులోకి ప్రవేశించారని సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలతో తమిళనాడులో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు. చైన్నై పట్టణానికి సమీపంలో తిరుమల  ప్రముఖ పుణ్యక్షేత్రం ఉండటంతో అక్కడ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా మొత్తం శ్రీ కాళహస్తి నుంచి తిరుమల వరకు, జిల్లా సరిహద్దుల వద్ద విస్తృతంగా స్థాయిలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హైవే ల్లో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో నిరంతర తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే జిల్లా మొత్తం పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని యస్.పి ఆదేశించారు.


జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల దృష్ట్యా పోలీసుల నిఘా పటిష్ట చేయడం జరిగిందని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. తిరుపతి, తిరుమల, శ్రీ కాళహస్తి టెంపుల్ ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనుమానిత వ్యక్తులు గాని, వస్తువులు గాని కనిపిస్తే జిల్లా ప్రజలు  సమాచారం అందించాలని స్థానిక పోలీసులు కోరుతున్నారు.  




మరింత సమాచారం తెలుసుకోండి: