వరద బాధితులంటే అధికారులకు ఎంత అలుసో తెలియజేసే సంఘటన గుంటూరు జిల్లా లో చోటు చేసుకుంది .  వరదలకు సర్వస్వం కోల్పోయి బాధపడుతున్న ప్రజలను అన్ని విధాలుగా  ఆదుకోవాల్సిన అధికారులు, వారిని   మరింత క్షోభకు గురిచేసేలా  వ్యవహరించారు. వరద బాధితులకు అందించిన ఆహార సామగ్రిలో కాలం చెల్లిన వంటనూనె ప్యాకెట్లను అందించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .  వరద బాధితులకు అందజేసిన  నూనె ప్యాకెట్ల వినియోగ కాలపరిమితి,  గత నెలతో ముగిసినప్పటికీ అధికారులు అవే నూనె  ప్యాకెట్లను వరద బాధితులకు అంటగట్టడం విస్మయాన్ని కలిగిస్తోంది .  ఈ ఘటన గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలంలో వెలుగులోకి వచ్చింది.


కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను అందజేయడం పట్ల స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహావేశాలను   వ్యక్తం చేస్తున్నారు . వరదలకు సర్వం కోల్పోయిన వారిపట్ల  అధికారులు వ్యవహరించే తీరు ఇదేనా ? అంటూ ప్రశ్నిస్తున్నారు .  వరద వచ్చిన ఐదు  రోజుల తర్వాత అధికారులు వచ్చి ఆహార  సామగ్రి అందించారని ,  అందులోనూ కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను కట్టబెట్టారని మండిపడుతున్నారు .  అధికారులు తమ నిర్లక్ష్య  చర్యలతో తమ  ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని విరుచుకుపడుతున్నారు . కాగా, ఈ వ్యవహారంపై అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. అయితే స్థానిక అధికారులు మాత్రం కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను వెనక్కి తీసుకెళ్లినట్లు సమాచారం.


 వరదల కారణంగా ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక, పునరావాస శిబిరాల్లో భోజనం ప్యాకెట్లను ఇవ్వడానికి ఆధార్ కార్డు చూపించాలని అధికారులు అడిగినట్లు వార్తలు వచ్చాయి . అసలే వరదల కారణంగా ముంపు కు గురైన వారిపట్ల అధికారులు వ్యవహరించే తీరు ఇదేనా అన్న విమర్శలు విన్పిస్తున్న తరుణం లో …  అధికారుల నిర్వాహకం మరొకటి వెలుగు చూడడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: