భారతీయ జనతా పార్టీ హైందవ ధర్మాన్ని పాటించే పార్టీ. పూర్తిగా సెంటిమెంట్లు ఉన్న పార్టీ. ఆ పార్టీకి ఇపుడు రోజులు బాలేవు అని చెప్పాలేమో. మరీ ముఖ్యంగా ఆగస్ట్ నెల గండం బీజేపీని పట్టి పీడిస్తోంది. ఇదే నెలలో వరసగా ఇద్దరు ప్రముఖ నాయకులను కోల్పోయిన విషాదాన్ని మాటల్లో ఎంత చెప్పినా తీరనిది. వాళ్ళు సీనియర్ యకులు,  రాజకీయ దిగ్గజాలు, బీజేపీని ముందుండి నడిపించిన వారు. అటువంటి కీలకమైన నేతలను కోల్పోవడం అంటే బీజేపీకి  పెను విషాదమే.


ఈ రోజు బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. జైట్లీ రాజకీయ జీవితం అంతా బీజేపీతోనె పెనవేసుకుపోయింది. ఆయన చక్కటి వ్యూహకర్త. బీజేపీలో ఆయన ఎన్నో విజయాలను తనదైన వ్యూహాలతో నమోదు చేశారు. ఆయన పనితీరు కూడా అద్భుతం. తనకు అప్పగించిన బాధ్యతలను వెనక్కి తగ్గకుండా అత్యంత సమర్ధంగా నిర్వహించడంలో  అరుణ్ జైట్లీ సరిసాటి ఎవరూ లేరంటారు.


అటువంటి  జైట్లీని కోల్పోయిన బీజేపీ శిబిరం పూర్తిగా నిరాశలో పడిపోయింది. ఇంతకు ముందు ఇదే నెలలో  6వ తేదీన మరో దిగ్గజ నాయకురాలు సుష్మా స్వరాజ్ హఠాన్మరణం చెందారు. ఆమె సైతం బీజేపీ వాణిని  తనదైన బాణీలో జనంలోకి బలంగా తీసుకువెళ్ళిన నాయకురాలు. బీజేపీలో ప్రధాని రేసులో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. ఆమె మరణంతో పార్టీ దాదాపుగా వైరాగ్యంలో పడిపోయింది. అద్వానీ అంతటి వారు కన్నీరు పెడితే మోడీ సైతం మాటలు రాక తీవ్ర మనోవేదన చెందారు.


ఇక ఆగస్ట్ అంటే మరోటి కూడా గుర్తుకువస్తుంది. గత ఏడాది ఇదే ఆగస్ట్ నెలలో మాజీ ప్రధాని వాజ్ పేయ్ మరణించారు. ఆయన ఆగస్ట్ 16న కన్నుమూశారు. దాంతో యావత్తు దేశం శోకసంద్రమైంది.  ఇలా ఏడాది వ్యవధిలో ఆగస్ట్ నెలలో ముగ్గురు నాయకులు కాలం చేయడం అంటే బీజేపీ తట్టుకోలేని విషయమే. వీరే కాదు, ఈ ఏడాది మొదట్లో కర్నాటకకు చెందిన కేంద్ర మంత్రి అనంత కుమార్, అలాగే కేంద్రంలో రక్షణ శాఖను చేపట్టిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వంటి వారు సైతం తనువు చాలించారు. ఇలా చూసుకుంటే ఎందరో కీలకమైన నేతలు అది కూడా చిన్న వయసులోనే కన్ను మూయడం బీజేపీకి రాజకీయంగా భారీ నష్టం చేకూర్చిన పరిణామంగా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: