ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్(ఈ-కేవైసీ) నమోదు కోసం చాలినన్ని ఆధార్ కేంద్రాలు లేకపోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు . శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ  ఒకే ఒక ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల స్థానిక మహిళలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు . రోజుల తరబడి లైన్లలో నిలబడిన టోకెన్లు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు . ఒక రోజుకు  కేవలం 145  టోకెన్లు ఇచ్చి సరిపెడుతున్నారని, దీనితో   తాము రోజుల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తుందని , దాంతో తాము కూలీ పనులకు కూడా వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .


అయితే ఈ-కేవైసీ చెలరేగుతున్న వదంతులకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఖండించారు . ఈ-కేవైసీ చేయించకపోతే రేషన్ కార్డులు రద్దుచేస్తారని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అయన  తెలిపారు. ఈ-కేవైసీ నమోదుచేయించుకోవడానికి గడువు ఏమి  లేదనీ, ఎప్పుడైనా చేయించుకోవచ్చని స్పష్టం చేశారు. కడప జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. ఈ-కేవైసీ సాకుతో రేషన్ డీలర్లు ప్రజల పేర్లను తొలగించినా, రేషన్ సరుకులు ఇవ్వకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ-కేవైసీ ప్రక్రియను సులభతరం చేసేందుకు మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ-కేవైసీ కోసం మహిళలు చంటి బిడ్డలతో గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.


ఈ-కేవైసీ నమోదు చేయించుకోకపోతే కార్డు రద్దు చేస్తారని రేషన్ డీలర్లు చేస్తున్న ప్రచారం తో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు . ఆధార్ కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతూ తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు పోటీ పడుతున్నారు . ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేసి అందినకాడికి దండుకుంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: