ఉరాష్ట్రప‌తిగా కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న మ‌న తెలుగు నాయ‌కుడు, బీజేపీ సీనియ‌ర్ నేత ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు క‌ల‌లు తీర‌వా? ఆయ‌న పెట్టుకున్న ఆశ‌లు ఇక‌, ఎప్ప‌టికీ నెర‌వేరే అవ‌కాశం కూడా క‌నుచూపుమేర‌లో క‌నిపించ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ పండితులు. అస‌లు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్య‌కు క‌ల‌లేంటి? అవి నెర‌వేర‌క‌పోవ‌డం ఏంటి? అంటున్నారా? అక్క‌డికే వ‌ద్దాం. 2014లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఎంతో కృషి చేసిన వెంక‌య్య.. అప్ప‌ట్లో చంద్ర‌బాబుతో బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డంలోనూ ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. 


ఈ క్ర‌మంలో ఏపీలోకి రెండు ఎంపీ సీట్లు, నాలుగు అసెంబ్లీ సీట్ల‌ను బీజేపీ కైవ‌సం చేసుకుంది. ఆ త‌ర్వాత ఏర్ప‌డిన మోడీ ప్ర‌భుత్వంలో కేంద్ర మంత్రిగా వెంక‌య్య చ‌క్రం తిప్పారు. ఇక‌, బాబు-మోడీ బంధం బీట‌లు వార‌కుండా జాగ్ర‌త్త‌గా సాగేలా కూడా వెంక‌య్య వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, క‌న్న త‌ల్లిపై ఎంత ప్రేమ ఉందో వెంక‌య్య‌కు అదేస‌మ‌యంలో క‌న్న ఊరుపైనా.. మాతృభాష‌పైనా అంతే మ‌మ‌కారం ఉండేది. ఆయ‌న పుట్టి పెరిగిన నెల్లూరు పై ఆయ‌న పెంచుకున్నంత ప్రేమ అంతా ఇంతా కాదు. ఈ క్ర‌మంలోనే కేంద్రంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న త‌న సొంత ఊరు నెల్లూరుపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. 


వాస్త‌వానికి సొంత రాష్ట్రంపైనా ఆయ‌న ప్రేమ కురిపిం చారు. ఏస‌మ‌స్య వ‌చ్చినా..కేంద్ర మంత్రిగాఆయ‌న రంగంలోకి దిగేవారు. మంత్రుల‌ను నేరుగా త‌న చాంబ‌ర్‌కే పిలిపించుకు ని త‌న‌కు సంబంధం లేక‌పోయినా.. స‌ద‌రు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేలా చ‌క్రం తిప్పారు. ఇలా.. ఆయ‌న త‌న సొంత రాష్ట్రంపై ప్ర‌త్యేక అభిమానం చూపించుకున్నారు. అదేస‌మ‌యంలో కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంక‌య్య నెల్లూరు అభివృద్దికి ప్ర‌త్యేకంగా కృషి చేశారు. 


ఈ క్ర‌మంలోనే ఆయ‌న అమృత్ ప‌థ‌కం స‌హా కేంద్రం అప్ప‌ట్లో ప్ర‌క‌టించిన అనేక ప‌థ‌కాల కింద ఇక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఆయా ప‌థ‌కాల‌తో నెల్లూరు రూపు రేఖ‌లు మారిపోవాల‌ని ఆయ‌న అభిల‌షించారు. నెల్లూరు చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయం ప్రారంభం కావ‌డంతోపాటు.. త‌న పేరు చిర‌స్థాయిగా ఉండిపోవాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే.. సాగ‌ర‌మాల‌, స‌ముద్ర సాంకేతిక‌త‌, ఎన్‌సీఈఆర్ టీ, క్రీడా గ్రామం వంటి వినూత్న కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. 


అదే స‌మ‌యంలో . గూడూరు-విజయవాడ మధ్య ఇంటర్‌సిటీ రైలు,  వెంకటాచలం- ఓబులవారిపల్లె నూతన రైల్వేలైన్ వంటి వాటికోసం క‌ల‌లు క‌న్నారు. ఇక్క‌డి వారు పొట్ట చేత ప‌ట్టుకుని ఎక్క‌డ‌కో వెళ్లే దుర‌దృష్టం ఉండ‌కూడ‌ద‌ని భావించారు. మ‌రి, ఇన్ని బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టిన వెంక‌య్య.. కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయా ప‌నులను వెంట‌బ‌డి త‌రిమి కొంత మేర‌కు చేయించారు. అయితే, అనూహ్యంగా ఆయన రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వి అయిన ఉప‌ రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని చేప‌ట్టారు. దీంతో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో, ప‌నుల్లో జోక్యం చేసుకునే అవ‌కాశం కోల్పోయారు. 


ఈ నేప‌థ్యంలో ఆయా ప‌నులు ప్ర‌స్తుతం ప‌డ‌కేశాయి. గూడూరు-విజయవాడ మధ్య ఇంటర్‌సిటీ రైలు ఆదివారం ప్రారంభించనుండగా, వెంకటాచలం- ఓబులవా రిపల్లె నూతన రైల్వేలైన్‌ ప్రారంభమైంది. ఇంతకుమించి కేంద్ర ప్రాజెక్టులేవీ ముందడుగు వేయలేదు. సొంత గడ్డపై ప్రేమతో కేంద్ర మంత్రి హోదాలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి జిల్లాకు సాధించుకొచ్చిన కేంద్ర ప్రాజెక్టులు దీనావస్థలో ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు మొండి గోడలకే పరిమితం కాగా ఇంకొన్ని పునాది రాళ్లతోనే ఆగిపోయాయి. 


ఐదు రాష్ట్రాల విద్యార్థులకు దిశానిర్దేశం చేసే గొప్ప పరిశోధన కేంద్రం... మరోవైపు సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న సందప, జీవరాశులపై అధ్యయనం చేసే పరిశోధన కేంద్రం, సాగర తీరం వెంబడి ఓడరేవులను, పారిశ్రామికవాడలను కలుపుతూ విశాలమైన సుందర రహదారులు.. జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించే సామర్థ్యం కలిగిన క్రీడా గ్రామం కలలు క్రమంగా కరిగిపోతున్నాయి.  మ‌రి వీటి సాధ‌న‌కు నెల్లూరు వాసులైనా న‌డుం బిగిస్తారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: