పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగందని వైసీపీ సర్కారు గట్టిగా నమ్ముతోంది. అందుకే చంద్రబాబు సర్కారు నామినేషన్ పద్దతిలో కట్టబెట్టిన టెండర్లను రీటెండరింగ్ ద్వారా పిలవాలని డిసైడయ్యింది. ఆ దిశగా అడుగులు వేసింది. అయితే ఇందుకు హైకోర్టు తీర్పు కాస్త అడ్డుపడింది. పోలవరం హెడ్ వర్క్స్ విషయంలో కాకపోయినా జల విద్యుత్ కేంద్రం విషయంలో వైసీపీ సర్కారుకు షాక్ తగిలింది.


ఈ అంశంపై జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు గురించి మోడీ చెప్పిన డైలాగును గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని గతంలో నరేంద్ర మోడీయే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు.. కానీ వాళ్ల ప్రధాని.. అదే మన ప్రధాని ఏం చెప్పాడో గుర్తు చేసుకోండి అంటూ చురకలు వేశారు అనిల్ కుమార్ యాదవ్.


పోలవరం హెడ్‌ వర్క్సు సంబంధించి రివర్స్‌ టెండర్లకు వెళ్లొద్దని హైకోర్టు చెప్పలేదని.. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. హెడ్‌వర్క్స్‌ జలవిద్యుత్తు ప్రాజెక్టుకు వేర్వేరుగా టెండరింగ్‌ వెళ్లాలా? లేదా? అనేది ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. హెడ్‌వర్క్స్‌ విషయంలో ఇప్పటికే ఇచ్చిన టెండర్లను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లొచ్చా? అనే అంశంపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.


పోలవరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏటీఎం అనే విషయాన్ని ప్రధాని మోదీ చెప్పారని... ఇప్పుడు భాజపా నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ధరలు పెరుగుతాయని అనుమానపడుతోందని అనిల్ చెప్పారు. కానీ ఏమాత్రం ధరలు పెరగడవని.. లేటు కూడా కాదని ఆయన భరోసా ఇచ్చారు. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఎట్టి పరిస్థితిల్లోనూ ధర పెరిగే ఆస్కారం లేదనే విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తోందన్నారు.


ఇక వైసీపీ సర్కారు వరదలను సృష్టించిందనే అంశంపైనా మంత్రి మాట్లాడారు.. శ్రీశైలంలో 881 అడుగులకు జలాశయం నీటి మట్టం చేరితేనే  రాయలసీమకు నీరివ్వగలమన్నారు. రాయలసీమకు 46 టీఎంసీలకు పైగా నీటిని తరలించామని తెలిపారు. ఈనెలాఖరులోగా 60 టీఎంసీలను రాయలసీమకు తరలిస్తామన్నారు. చంద్రబాబు చెప్పినట్లు వరద నీరు ఒకేసారి విడుదల చేస్తే... ఇప్పుడు రిజర్వాయర్లలో అస్సలు నీరు ఉండేవే కాదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: