రాజధాని అమరావతిని మారుస్తారంటూ ఇటీవల బాగా జరిగిన ప్రచారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాజధాని రైతులతో ఆయన హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. ఒక ప్రభుత్వం నిర్ణయాన్ని మరో ప్రభుత్వం మార్చడం మంచిది కాదన్న పవన్.. కావాలంటే జగన్ అమరావతి బాగా అభివృద్ధి చేసి పేరు తెచ్చుకోవాలని సూచించారు.


రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా రాజధాని విషయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి మార్చేందుకు  ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదన్నారు. ప్రభుత్వం మారిన ప్రతి సారి రాజధానిని మార్చుకుంటూ పోతే వ్యవస్థలపై నమ్మకం పోతుందని మండిపడ్డారు. రాజధాని తరలింపు విషయంపై జరగుతున్న ప్రచారం దృష్ట్యా అమరావతి ప్రాంత రైతులు తమకు అండగా నిలబడాలని జనసేనాని పవన్ కల్యాణ్ ను కోరారు.


హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ తో సమావేశమై రాజధాని తరలిపోతే తమకు రాష్ట్రానికి కలిగే నష్టాలను వివరించారు. రాజధాని ప్రాంత రైతుల అభ్యర్థనపై  సానుకూలంగా స్పందించిన పవన్ కల్యాణ్... అమరావతి విషయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంతం ఎంత మేర అభివృద్ధి చెందిందో రాష్ట్ర ప్రజలకు తెలిపేందుకు స్వయంగా అమరావతిలో పర్యటిస్తానన్నారు.


ఇదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణంపైనా పవన్ స్పందించారు. జైట్లీ మరణం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక ఆర్ధిక మండళ్ల చట్టం రూపకల్పనలో జైట్లీ కీలకంగా వ్యవహరించారని, విద్యార్థి నాయకుడిగా ఎమర్జెన్సీ  కాలంలో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి 19 నెలలపాటు జైలు జీవితాన్ని గడిపారని గుర్తు చేశారు. జైట్లీలో సంస్కరణాభిలాష మెండుగా కనిపించేదని, న్యాయవాదిగా, కేంద్ర మంత్రిగా ఆయన సేవలు మరువలేవన్నారు. పలు ఆర్ధిక, న్యాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. జైట్లీ గారి కుటుంబానికి తన తరఫున, జన సైనికుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: