ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం గ‌త నాలుగైదు రోజులుగా తీవ్ర‌మైన ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. రాజ‌ధాని విష‌యంపై ఏపీకే చెందిన వైసీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన ప్ర‌క‌ట‌న‌తో అటు వైసీపీ నేత‌ల్లోనే కాకుండా యావ‌త్ ప్ర‌జ‌లంద‌రిలోనూ తీవ్ర‌మైన గంద‌ర‌గోళం నెల‌కొంది. బొత్స నాలుగు రోజుల క్రితం చేసిన ప్ర‌క‌ట‌న స‌మ‌ర్థిస్తూ ఆదివారం మ‌రోసారి మాట్లాడారు. రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీని గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని, రాజధాని ప్రాంతానికి వరద ముప్పుపొంచి ఉందన్నారు. 8 లక్షల క్యూసెక్కుల నీటికే రాజధాని ప్రాంతం ముంపుకు గురైతే.. 11 లక్షలు క్యూసెక్కులు నీరు వచ్చినట్లయితే ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. 


ఇక బొత్స వ్యాఖ్య‌లు ఇలా ఉంటే వీటిపై టీడీపీ నేత‌ల‌తో పాటు బీజేపీ నేత‌లు చివ‌ర‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సైతం స్పందిస్తున్నారు. వీరంతా రాజ‌ధాని త‌ర‌లింపు క‌రెక్ట్ కాద‌ని చెపుతున్నారు. ప‌వ‌న్ సైతం రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి మారిస్తే తాను ఉద్య‌మిస్తాన‌ని చెపుతున్నారు. ఇక బీజేపీ నేత‌లు సైతం రాజ‌ధానిని మార్చ‌డం కుద‌ర‌ద‌ని చెపుతున్నారు. వైసీపీలోనే కొంద‌రు రాజ‌ధానిపై జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసే వ‌ర‌కు ఎవ్వ‌రి మాట‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని చెపుతున్నారు. ఏదేమైనా బొత్స చేసిన ఒకే ఒక్క ప్ర‌క‌ట‌న రాజ‌కీయ పార్టీల‌నే కాకుండా అంద‌రిని గంద‌ర‌గోళంలో ప‌డేసింది.


ఇదిలా ఉంటే ఏపీకే చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆయ‌న ఏపీకి రాజధానిగా అమరావతి కొనసాగకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. రాజ‌ధాని మార్పు అంశంపై జ‌గ‌న్ ఇప్ప‌టికే బీజేపీ అధిష్టానంతో చ‌ర్చించార‌ని.. ఈ విష‌యం బీజేపీ అధిష్టానమే తనకు చెప్పిందన్నారు. ఏపీకి ఒకటి కాదు.. నాలుగు రాజధానులు ఉండబోతున్నాయని మ‌రో బాంబు పేల్చారు. టీజీ చెప్పిన ప్ర‌కారం విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాలు ఏపీకి రాజధానులు కాబోతున్నాయని పేర్కొన్నారు. 


తాను చెప్పింది నూటికి నూరు శాతం నిజం అని కూడా టీజే చెప్ప‌డంతో ఇప్పుడు రాజ‌ధానిపై మ‌రో గంద‌ర‌గోళం మొద‌లైట్ల‌య్యింది. దీనిపై ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌క‌ట‌న చేస్తే త‌ప్పా ఎవ్వ‌రు మాట్లాడినా న‌మ్మ‌కూడ‌ద‌ని వైసీపీ నేత‌లు చెపుతున్నారు. ఇక అక్క‌డితో ఆగ‌ని టీజీ పోలవరం టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదన్నారు. పోల‌వ‌రాన్ని జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం చేస్తే చంద్ర‌బాబుకు పొలిటిక‌ల్ లైఫ్ ఇచ్చిన‌ట్లేన‌ని.. అలాగే కేసీఆర్‌కు ఆయ‌న ఎంత దూరంగా ఉంటే ఆయ‌న‌కు రాజ‌కీయంగా అంత మంచిద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: