అమెజాన్‌ అడవులు  ఎందుకు తగులబడ్డాయి? ప్రకృతి సిద్ధంగానే అవి అంటుకున్నాయా ? ఎవరైన వాటికి నిప్పంటించారా ? అందుకు కారణాలేమిటీ?  బ్రెజిల్‌లోని అడువులు ఎక్కువ తగలబడుతున్నా ఆ దేశం ఎందుకు ఆలస్యంగా స్పందించింది? బ్రెజిల్‌ నిర్లక్ష్య ధోరణి ప్రకృతి గుండెల్లో మంటలను రాజేసిందా..?


కార్చిచ్చుతో  కొద్ది రోజులుగా అమెజాన్‌ అడవి తగులబడిపోతోంది. వేలాది ఎకరాల్లో అడవులు బుగ్గి పాలవడంతో పర్యావరణంపై దుష్ప్రభావం చూపిస్తోంది. అక్కడంతా దట్టమైన పొగ కమ్మేయడంతో చీకటిమయమైంది. లక్షలాది చెట్లు దహనం కావడంతో భారీ స్థాయిలో కార్బన్‌ డై ఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వాయువులు వాతావరణంలోకి ఎక్కువగా విడుదలౌతున్నాయి. మొత్తం అమెజాన్‌ పరివాహకం 30 లక్షలకు పైగా మొక్కలు, జంతువులు, ఇతర జీవజాతులకు నెలవు. దాదాపు పది లక్షల మంది ఆదివాసులు ఈ అడవుల్లో నివసిస్తున్నారు. భూతాపాన్ని నియంత్రించడానికి, ప్రపంచానికి ఆక్సిజన్‌ అందించడానికి ఈ ప్రాంతం చాలా కీలకమైంది. కోట్లాది టన్నుల కర్బన ఉద్గారాలను ఈ అడవులు పీల్చుకుని స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. 


ఉత్తర ప్రాంత రాష్ట్రాల్లో ఈ మంటల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 74 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న అమెజాన్ బేసిన్‌ ప్రధానంగా బ్రెజిల్‌లో ఉంది. దీంతో బ్రెజిల్‌లో అతి పెద్ద రాష్ట్రమైన అమెజానాస్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నెల 14న బ్రెజిల్‌లోని ట్రాన్స్‌-అమెజానియా హైవేలో కొన్ని మీటర్ల విస్తీర్ణంలో మొదలైన ఈ మంటలు వారం రోజుల వ్యవధిలోనే  ఇతర ప్రాంతాలకు వ్యాపించి ప్రస్తుతం అదుపు చేయలేనంతగా విస్తరించడంతో బ్రెజిల్‌ ప్రభుత్వం చేతులెత్తేసింది. 


బ్రెజిల్‌లోని ఈ అడ‌వులు ఏటా రికార్డు స్థాయిలో ద‌గ్ధం అవుతున్నాయి.  దీంతో బ్రెజిల్‌ కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది.  అడవుల్లో నేరస్థులను ఏరివేసేందుకు 44వేల ట్రూపుల సైన్యాన్ని రంగంలోకి దించింది. కార్చిచ్చు ఆర్పేందుకు పొరుగు దేశాలు పరాగ్వే, బొలీవియాల సహాయం తీసుకుంటోంది బ్రెజిల్‌. ఈ భూమిపై ఉన్న ప్రతీ ప్రాణి... అమెజాన్ అడవులకు రుణపడి ఉన్నట్లే. భూగోళానికి అధిక స్థాయిలో ప్రాణ‌వాయువును అందించే అమెజాన్ అడ‌వులు నిత్యం దగ్ధం అవుతూనే ఉన్నాయి.


మానవాళికి అందుతున్న ఆక్సిజన్‌లో ఐదు శాతం అమెజాన్ అడవులే ఇస్తున్నాయి. అలాంటి అడవులు ఇప్పుడు తగలబడిపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత దట్టమైన రెయిన్ ఫారెస్ట్‌లో 72వేల 843 చోట్ల మంటలు చెలరేగుతున్నాయి. బ్రెజిల్‌ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఈ విష‌యాన్ని వెల్లడించింది. నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఫ‌ర్ స్పేస్ రీస‌ర్చ్ ఏజెన్సీ తాజాగా ఓ డేటాను రిలీజ్ చేసింది. గ‌త ఏడాది అడ‌వుల్లో అగ్ని ప్రమాదాలు జ‌రిగిన సంఘ‌ట‌న‌లు 84 శాతం పెరిగిన‌ట్లు ఆ ఏజెన్సీ తెలిపింది. అమెజాన్ అడ‌వుల్లో న‌రికివేత ఎక్కువైన‌ట్లు ఇటీవ‌ల ఆ ఏజెన్సీ ఓ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఆ దేశాధికారులు ఈ విషయాన్ని ఖండించారు. వ్యవ‌సాయం కోసం అడ‌వులు న‌రికివేసేందుకు రైతుల‌కు అనుమ‌తి ఇవ్వడం వ‌ల్లే ఈ ప‌రిస్థితి త‌లెత్తిన‌ట్లు ప‌ర్యావ‌ర‌ణ‌వేత్తలు వాపోతున్నారు. అమెజాన్‌ కోసం ప్రార్థించండి అంటూ సోషల్‌మీడియా ద్వారా ఉద్యమం కొనసాగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: