కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏపీ రాజధాని తరలింపుపై రగడ కొనసాగుతోంది.ఇది ఇప్పటితో చల్లారేలా లేదు,నిప్పుకు ఉప్పు తోడైనట్లు రాజధాని విషయంలో ఇప్పుడు మరో వివాదానికి తెరతీసారు తాజాగా రాయలసీమకు చెందిన ఎంపీ టీజీ వెంకటేష్.చెప్పేదంతా చెప్పి జగన్ బీజేపీ అధిష్టానంతో మాట్లాడిన విషయమే చెప్తున్నానని పేర్కొనడం విశేషం.ఏపీకి ఒకటి కాదు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ బాంబు పేల్చారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప ఏపీ రాజధానులుగా ఉండబోతున్నాయన్నారు. ఇది తన మాట కాదని..బీజేపీ అధిష్టానమే తనకు చెప్పినట్లు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.



రాజధానుల ప్రతిపాదన నూటికి నూరుశాతం నిజమని ఆయన బల్లగుద్ది చెప్పడం మరీ విశేషం.ఇక భవిష్యత్తులో అమరావతి రాజధానిగా కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు.రాజధాని ఒకేచోట కాకుండా వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసే దిశగా,ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని విషయమై బీజేపీ అధిష్టానంతో మాట్లాడారని,ఉత్తరాంధ్ర,కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటుపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు.ఇప్పటివరకు మొదలుపెట్టిన ఒక్క రాజధాని విషయమే తేలకుండా ఉన్నఈ సమయంలో నాలుగు రాజధానుల విషయం తెరపైకి వచ్చే సరికి ఏపీ ప్రజలు అయోమయంలో పడ్డారు.ఇక ఇప్పటికే అమరావతిని మారిస్తే,సహించబోమంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.



మరో అడుగు ముందుకేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చెట్టాపట్టాలపైనా టీజీ వెంకటేష్ తనదైన శైలిలో స్పందించారు.కేసీఆర్ ను ఎంత తక్కువ నమ్మితే అంత మంచిదని జగన్‌కు హితవు పలికారు.పోలవరం టెండర్ల విషయంపైనా స్పందిస్తూ,టెండర్ల రద్దు,రివర్స్ టెండర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ సర్కార్ సంప్రదించలేదన్నారు.మళ్లీ పోలవరం టెండర్లతో నిర్మాణ ప్రక్రియ చాలా ఆలస్యమవడమే గాక రాష్ట్రాభివృద్ది కుంటుబడే అవకాశం వుందని.అదే జరిగితే జగనే టీడీపీ అధినేత చంద్రబాబుకు లైఫ్ ఇచ్చినట్టేనని అంటూ ఇలా రాజధాని అమరావతి విషయంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్.


మరింత సమాచారం తెలుసుకోండి: