వరుస పరాజయాలతో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ అస‌లు ఏం చేయాలో తెలియని దీనిస్థితిలో ఉంది. రాహుల్ నాయ‌క‌త్వ సామ‌ర్థ్యంపై సామాన్య జ‌నాల‌కు కూడా న‌మ్మ‌కం లేకుండా పోయింది. చివ‌ర‌కు సోనియానే రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే పార్టీకి తిరిగి జ‌వ‌స‌త్వాలు తెచ్చేందుకు సోనియా త‌న మార్క్ రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. ఆమె పొత్తులకు సై అంటోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీ త్వరలో జరగనున్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్‌తో పొత్తుకు సన్నద్ధమైంది. 


బెంగాల్‌లో వామపక్ష ఫ్రంట్‌తో జత కట్టేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపారు. గ‌తంలో 2004 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలో జ‌ట్టుక‌ట్టి దేశ‌వ్యాప్తంగా మెజార్టీ స్థానాలు గెలుచుకున్నాయి. వామ‌ప‌క్ష పార్టీల చ‌రిత్ర‌లోనే ఆ పార్టీకి ఆ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన సీట్లు ఓ రికార్డుగా నిలిచాయి. చాలా ఏళ్ల త‌ర్వాత ఆ ఎన్నిక‌ల్లోనే వామ‌ప‌క్షాలు స‌త్తా చాటాయి. 2004లో నాటి స‌మైక్య రాష్ట్రంలోనూ వామ‌ప‌క్షాలు మంచి సీట్లు సాధించాయి. అప్ప‌టి నుంచి కాంగ్రెస్‌తో పాటు వామ‌ప‌క్షాల ప్ర‌భావం కూడా దేశంలో త‌గ్గుతూ వ‌చ్చింది.


బెంగాల్‌, త్రిపుర ఇలా ఒక్కో రాష్ట్రాన్ని వామ‌పక్షాలు కోల్పోతున్నాయి. ఇక ఇప్పుడు ఉప ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేసేందుకు రెడీ అవుఉతున్నియి. లోక్‌సభ ఎన్నికలకు ముందు కూటమిగా అవతరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, ఆ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం వీయడంతో కాంగ్రెస్‌, వామపక్షాలు పునరాలోచనలో పడిన నేపథ్యంలో బెంగాల్‌లో కాంగ్రెస్‌-వామపక్ష కూటమి కొలిక్కివచ్చింది.


ఇటీవ‌ల లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బెంగాల్‌లో బీజేపీ ప్ర‌భంజంన వీచింది. ఆ పార్టీ ఏకంగా 18 ఎంపీ సీట్లు గెలిచింది. ఇక లోక్‌సభ స్ధానాలకు గాను కాంగ్రెస్‌ కేవలం రెండు స్ధానాలతోనే సరిపెట్టుకోగా, లెఫ్ట్‌ఫ్రంట్‌ ఖాతా తెరవలేదు. ఇక ఇప్పుడు క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళితేనే తృణ‌మూల్, బీజేపీని ఢీ కొట్ట‌వ‌చ్చ‌న్న‌దే ఆ పార్టీల వ్యూహంగా తెలుస్తోంది. నార్త్‌ దినాజ్‌పూర్‌ జిల్లాలోని కలియాగంజ్‌, పశ్చిమ మిడ్నపూర్‌ జిల్లా ఖరగ్‌పూర్‌, నదియా జిల్లాలోని కరీంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మ‌రి ఈ పొత్తుతో అయినా రెండు పార్టీలు పూర్వ‌వైభ‌వం సాధిస్తాయో ?  లేదో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: