గ‌త కొంత‌కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్న కాంగ్రెస్ నేత‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్ళెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన ఉద్దేశంతో సోమవారం నుంచి పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి  ప్రకటించారు. అయితే… ఆయన పాదయాత్రకు ఎటువంటి అనుమతి లేదని.. నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ నోటీసులు జారీచేశారు. పాదయాత్రకు పోలీసు బందోబస్తు ఇవ్వలేమని ఎస్పీ రంగనాధ్ నోటీసులో స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు తాజాగా ర‌చ్చ‌కు కార‌ణంగా మారాయి.


ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్రపై తనకు ఎటువంటి నోటీసులు రాలేదని.. ప్రభుత్వం నిరంకుశ ధోరణితో తన  పాదయాత్ర కార్యక్రమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు . పాదయాత్ర చేయడం తన హక్కు అని.. తన స్వేచ్ఛకు అడ్డుపడితే… కోర్టుకు వెళ్తా అన్నారు. హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని అయినా పాదయాత్ర చేసి తీరుతా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్ర‌క‌టించారు. 


ఇదిలాఉండ‌గా, గ‌త కొద్దికాలంగా వివిధ అంశాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం తీరును త‌ప్పుప‌డుతూ కోమ‌టిరెడ్డి మండిప‌డుతున్నారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కి కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై కోర్టు ను ఆశ్రయిస్తానని చెప్పారు. అధికారం ఉన్న ముఖ్యమంత్రి సచివాలయానికి రాడు, సచివాలయానికి వచ్చే మంత్రులకు అధికారం లేదని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహిళ అధికారి పై దాడి ఘటన చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వస్తుందని వెంకట్ రెడ్డి అన్నారు. పోలీసులకు ఉన్నట్లే అటవీ అధికారులకు సైతం లైసెన్స్డ్ ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్నపాపపై హత్యాచారం జరిగితే సీఎం కేసీఆర్ కు పరామర్శించేందుకు సమయం లేని ముఖ్యమంత్రిని తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో జాతీయ రహాదారుల విషయంలో సీఎం కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యసాలు ఇచ్చి ఇప్పుడు మరిచారని అన్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను కేంద్రమే గుర్తించి జాతీయ రహదారులుగా మారుస్తారని  సీఎం పట్టించుకోవడం మానేశారని వెంకట్ రెడ్డి అన్నారు. 2018 ఎన్నికల ప్రచారసభలలో 3,150 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసిందని వెంకట్ రెడ్డి మండిప‌డ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: