అమరావతి ఈ పేరు వినని రోజు లేదు టీడీపీ హయాంలో. ఎందుచేతంటే చంద్రబాబు కలల రాజధాని అది. ప్రపంచంలోనే అగ్ర నగరంగా అమరావతిని నిర్మించాలన్నది బాబు సంకల్పం. సరే ఆశలు అందరికీ ఉంటాయి. ఆచరణ చాలా ముఖ్యం. అక్కడే టీడీపీ సర్కార్ చతికిలపడింది. కనీస రాజధాని లేకుండా కట్టు బట్టలతో వదిలేసిన నవ్యాంధ్రకు తక్షణం రాజధానికి నిర్మించి మెల్లగా అభివ్రుధ్ధి చేసుకోవాల్సిన సమయంలో లక్షల కోట్ల భారీ బడ్జెట్లతో బాబు అతి పెద్ద  కాన్వాస్ మీద  రాజధాని అమరావతి బొమ్మ గీయాలనుకున్నారు.


ఫలితంగా అమరావతి బాబుకే  రాజకీయంగా ఎటువంటి ఫలితం ఇవ్వలేదు. ఎంతలా అమరావతి అని పలవరించినా ఆయన కుమారుడు, అప్పటి మంత్రి నారా లోకేష్ దారుణంగా మంగళగిరిలో ఓడిపోయారు. దీని అర్ధం ఏంటి అంటే అమరావతి భ్రమరావతిగానే మిగిలిపోయిందని. అలా  అమరావతి జపం నిరంతరం చేయడం వల్ల మిగిలిన ప్రాంతాలు, సామాజిక వర్గాలు సైతం టీడీపీ మీద గుర్రుమీదుండి అంతా కలసి ఒక్కసారి ఓటు దెబ్బ తీశాయి. ఆ ఫలితమే కేవలం 23 సీట్లతో చంద్రబాబు భారీ పరాజయం.


ఇదిలా ఉండగా అమరావతిని ముట్టుకోవద్దంటూ బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ జగన్ కి సలహా ఇస్తున్నారు. అమరావతి అంటే మాత్రం ఉత్తరాంధ్ర, రాయలసీమ తమ దోవ తాము చూసుకుంటాయని ఆయన కఠిన హెచ్చరికే జారీ చేశారు. అంటే ఏపీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలనుకుంటే  నవ్యాంధ్ర మూడు ముక్కలు కావడం ఖాయమని టీజీ చెప్పకనే చెప్పేశారన్న మాట.


ఏపీ సర్వతోముఖాభివ్రుధ్ధి చెందాలంటే అమరావతిని పక్కన‌ పెట్టి అన్ని ప్రాంతాలు అభివ్రుధ్ధి చేయాలన్నది టీజీ వంటి వారి అభిప్రాయంగా ఉంది. నిజానికి ఇదే భావనను శివరామకిష్ణ కమిటీ కూడా తెలియచెసింది. రాజధాని పేరిట పెట్టుబడులు, అభివ్రుధ్ధి ఒకే చోట కేంద్రీకరిస్తే మళ్ళీ తెలంగాణా లాంటి ఉద్యమాలు వస్తాయని కూడా చెప్పింది. మరి జగన్ సర్కార్ వికేంద్రీకరణకే ద్రుష్టి పెడుతూండడం వల్ల అమరావతి టీడీపీ తమ్ముళ్ళ మెదడులోనే ఇంక చూసుకోవాలన్నమాట. అమరావతిని మరచిపోవాల్సిందే అని టీజీ అన్న మాటలు ఇపుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: