పాపం ఇప్పుడు ఏపీలో ఆ పార్టీ నాయ‌కుల‌ను, ఆ పార్టీ ప‌రిస్థితిని చూస్తూ ప్ర‌తి ఒక్క‌రికి తెగ జాలిక‌లుగుతోంది. చివ‌ర‌కు రాజ‌కీయ మేథావులు సైతం ఆ పార్టీ గురించి ఇదే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆ పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్న వాళ్లె తెర‌చాటుకు వెళ్లిపోతున్నారు.. తెర‌మ‌రుగు అయిపోతున్నారు. ఇప్పుడు ఆ పార్టీలోకి కొత్త దేవుళ్లు.. క‌మ్మ దేవుళ్లు గ‌ట్టిగా వ‌స్తున్నారు. ఇప్పుడు వీరి హ‌వానే అక్క‌డ న‌డుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని న‌మ్ముకున్న నాయ‌కుల ప‌రిస్థితి కూర‌లో క‌రివేపాకులా.. పులుసులో చింత‌పండు మాదిరిగా మారిపోయింది. ఇంత‌కు ఆ పార్టీ ఏదో కాదు ఇప్ప‌టికే మీకు అర్థ‌మై ఉంటుంది... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.


బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ఆ పార్టీ ప‌రిస్థితి గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. క‌నీసం ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని ప‌రిస్థితి. టీడీపీతో క‌లిసి మెలిగిన బీజేపీ బ‌య‌ట‌కు వ‌చ్చాక టీడీపీపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వ‌చ్చినా మ‌ళ్లీ ఆ పార్టీ నేత‌లు ప‌స‌లేని విమ‌ర్శ‌లు చేస్తూ కాలం వెల్ల‌బుచ్చుతున్నారు. ఈ విమ‌ర్శ‌లు బీజేపీకి కొత్త కాక‌పోయినా విమ‌ర్శ‌లు చేసే నేత‌లు మాత్ర‌మే మారారు.


గ‌తంలో ఇవే వ్యాఖ్య‌లు ఇక్క‌డ బీజేపీ నేత‌లు సోము వీర్రాజు, మాణిక్యాల‌రావు వంటి వారు చేసేవారు. అప్పుడు ఈ నేత‌లంతా టీడీపీకి, బీజేపీకి క‌టిఫ్ అయ్యాక టీడీపీపై విమ‌ర్శ‌లు చేస్తూ మీడియాలో ఉండేవారు. కానీ ఇప్పుడు మాట‌లు, విమ‌ర్శ‌లు అవే కాని నేత‌లే మారారు. సుజ‌నా చౌద‌రి, పురందేశ్వ‌రి, జీవీఎల్‌.న‌ర‌సింహారావు లాంటి నేత‌ల హ‌వా ఇప్పుడు ఏపీ బీజేపీలో స్టార్ట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళుతోన్న ఓ సామాజిక‌వ‌ర్గం నేత‌ల హ‌వా ఇప్పుడు ఎక్కువుగా క‌న‌ప‌డుతోంది. వీళ్ల దెబ్బ‌కు ఇప్పుడు పాత బీజేపీ నేత‌లు ఎక్క‌డ ఉన్నారో ?  తెలియ‌ని ప‌రిస్థితి.


పాపం ఇంకా చెప్పాలంటే ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరిన ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌రిస్థితి కూడా అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీలో చేరిన వాళ్ల దెబ్బ‌తో క‌న్నానే మీడియా ముందుకు వ‌చ్చి ఏదో ఒక విమ‌ర్శ చేస్తూ త‌న గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు. అయినా క‌న్నాను ప‌ట్టించుకునే వాళ్ల సంఖ్య రోజు రోజుకు త‌గ్గిపోతోంది. ఇంకా చెప్పాలంటే క‌న్నాను పార్టీ అధ్య‌క్షుడిగా ఫెయిల్ అయ్యార‌ని.. ఆయ‌న్ను త‌ప్పిస్తార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఏదేమైనా ఏపీలో బీజేపీ దుస్థితి చూసి ఆ పార్టీ వాళ్లే పాపం... ప్చ్ అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: