గత అయిదేళ్లపాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలని లాగేసుకున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ ఎంతమంది ఎమ్మెల్యేలనైతే లాక్కుందో అంతమందే ఎమ్మెల్యేలే మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. ఇక వైసీపీ 151 సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చేసింది. ఇక ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే అప్పుడు వైసీపీ నుంచి టీడీపీ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయారు కానీ ఒక్క గొట్టిపాటి రవికుమార్ మాత్రం విజయం సాధించారు.


గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గొట్టిపాటి..2014కు ముందు వైసీపీలోకి వెళ్ళి అప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా నిలబడిన కరణం వెంకటేష్ పై విజయం సాధించారు.  అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో ఇటు జంప్ అయిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఒకవేళ గొట్టిపాటి వైసీపీలో ఉంటే ఖచ్చితంగా మంత్రి అయ్యేవారు. ఎందుకంటే రవి జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా మెలిగారు. అలాంటి నేత తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కరణం బలరాం కుటుంబానికి చెక్ పెట్టాలని టీడీపీలోకి వెళ్లారు.


అయితే ఇప్పుడు వైసీపీలో లేకపోవడం పట్ల గొట్టిపాటి ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎలా అయిన జగన్ చెంతకు చేరాలని చూస్తున్నారని, అందుకే ప్రస్తుతం టీడీపీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు గొట్టిపాటి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సందర్భాలు లేవు, అసెంబ్లీ సమావేశాల్లో పెద్దగా కనపడలేదు. ఒకవేళ కనపడిన ఎక్కడో ఒక మూలనే ఉన్నారు. ఈ క్రమంలోనే గొట్టిపాటి గోడ దూకేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.


వైసీపీలో ఉండగా తనతో సన్నిహితంగా ఉన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా రాయబారాలు నడుపుతున్నట్లు సమాచారం. అయితే తమ పార్టీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జగన్ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక దీని మీద గొట్టిపాటి తన సన్నిహితులతో చర్చలు జరిపి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పార్టీ మారాలని ఫిక్స్ అయితే రాజీనామా చేసి వెళ్ళి మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిచేలా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: