త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌నో పులి! ఆయ‌న మాట‌కు తిరుగులేదు. ఆయ‌న అడుగుతీసి బ‌య‌ట పెడితే.. సామాన్యుల గుండెల్లో హ‌డ‌ల్‌. ఆయ‌న నోరు తెరిస్తే.. వివాదాల పుట్ట‌. రాజ‌కీయంగా దూకుడు.. నోటి దురుసు.. చేతి వాటం ఇలా చెప్పుకొంటూ.. పోతే.. ఆయ‌న గురించి పెద్ద చ‌రిత్రే అవుతుంది. ఆయ‌నే.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ ర్గం నుంచి రెండు సార్లు వ‌రుస‌గా విజ‌యం సాదించిన మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌. 2009, 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వరుస‌గా విజ‌యం సాధించారు.


అయితే, ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌ల‌కంటే కూడా ఆయ‌న చేసిన వివాదాల‌తోనే నిత్యం మీడియాలో ఓ వెలుగు వెలిగారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో అంతా తానే అయి నియోజ‌క‌వ‌ర్గాన్ని శాసించారు. ఇక‌, త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షి వివాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న మ‌రింత తీవ్ర వివాద‌మ‌య్యారు. అయితే, ఆయ‌న సామాన్యుల‌పాలిట దేవుడిగా కూడా పేర్కొంటారు. త‌న ఇంటికి వ‌చ్చిన వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలోనూ ఆయ‌న ముందుండేవార‌ని పేరుంది. 
అయితే, ఎంత మంచి చేసినా.. తాను చేసుకున్న చెడు ప‌నుల కార‌ణంగా చింత‌మ‌నేని తీవ్ర వివాదాస్ప‌ద నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో అధినేత చంద్ర‌బాబు మాట‌ను సైతం లెక్క‌చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మీడియా ను కూడా దూషించ‌డం ఆయ‌నే చెల్లింది. త‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాసిన విలేక‌రుల‌ను ఇంటికి పిలిచి త‌న‌దైన శైలిలో స‌త్క‌రించిన సంఘ‌ట‌న‌లు కూడా వెలుగు చూశాయి.


తాజాగా చింత‌మ‌నేని ప‌రార‌య్యారనే వార్త మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. చంద్ర‌బాబు హ‌యాంలోనే ఆయ‌న‌పై అనేక కేసులు న‌మోద‌య్యాయి. అయితే, అప్ప‌ట్లో త‌మ పార్టీ ప్ర‌భుత్వం ఉండ‌డంతో పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం పైనా చ‌ర్య‌లు తీసుకోవ‌డంపైనా ఆచితూచి అడుగులు వేశారు. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో పోలీసులు చ‌ర్య‌లు తీసుకునేందుకు రెడీ అయ్యారు. తాజాగా.. పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తీసుకువెళుతున్న దళిత యువతపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దుర్భాషలాడుతూ, దాడికి యత్నించారు. 


ఈ సంఘటనపై చింతమనేనితోపాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసేందుకు శుక్రవారం ఉదయం దుగ్గిరాల గ్రామంలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఏలూరు నగరంలోని పోలీసు యంత్రాంగం భారీగా స్పెషల్‌ పోలీసులు చింతమనేని ఇంటి వద్ద మోహరించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో తన ఇంటికి చేరుకోవడంతో చింతమనేని ప్రభాకర్‌ మధ్యాహ్నం వరకు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. 


విషయం తెలిసిన ఆయన అనుచురులు చింతమనేని ఇంటికి చేరుకుని హడావుడి చేశారు. బయటకు వస్తే అరెస్టు చేస్తారనే భయంతో చింతమనేని రాకుండా తాత్సారం చేశారు. అయితే మధ్యాహ్నం తరువాత ఇంటినుంచి బయటకు వచ్చిన చింతమనేని మీడియాతో మాట్లాడి, ఇక్కడికే వెళ్లి వస్తా అంటూ పోలీసులకు చెప్పి చల్లగా జారుకున్నారు. దీంతో ఇంత బ‌తుకు బ‌తికి.. త‌న‌కు తిరుగేలేద‌ని కాల‌ర్ ఎగ‌రేసిన చింత‌మ‌నేని ఇప్పుడు కేసుల దెబ్బ‌తో తోక‌ముడ‌వ‌డం అటు పార్టీలోనూ ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: