రాష్ట్రంలో అనూహ్య‌రీతిలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ పాల‌న‌కు నేటితో 100 రోజులు పూర్త య్యాయి. ఈ వంద రోజుల్లో ఆయ‌న అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. అనేక సంచ‌ల‌న నిర్ణ యాలు కూడా తీసుకున్నారు. అయితే, ఎన్ని నిర్ణ‌యాలు తీసుకున్నా.. కొన్ని విష‌యాల్లో మాత్రం జ‌గ‌న్ ప్ర ద‌ర్శించిన దూకుడుపై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల ప‌రంపర కొన‌సాగుతోంది. మంచి క‌న్నా చెడు వేగంగా ప్ర‌యాణం చేస్తుంద‌ని అన్న‌ట్టుగా.. జ‌గ‌న్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. ఆయ‌న తీసుకున్న ప్ర‌జారంజ‌క నిర్ణయాల కంటే కూడా వేగంగా కొన్ని నిర్ణ‌యాల్లో జ‌గ‌న్ దూకుడు ఎక్కువ‌గా ప్ర‌చారానికి వ‌స్తోంది. దీనినే విపక్షాలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.


విష‌యంలోకి వెళ్తే.,. జ‌గ‌న్ ఈ ఏడాది మే 30న విజ‌య‌వాడలో సీఎంగా ప్ర‌మాణం చేశారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను తిర‌గ‌దోడ‌తాన‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పారు. ముఖ్యంగా పోల‌వరం ప్రాజెక్టు స‌హా అనేక విష‌యాల్లో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అయిన వారికి దోచి పెట్టింద‌ని ఆయ‌న ఆరోపించారు.దీంతో ప్ర‌జా ధ‌నం విచ్చ‌ల‌విడిగా దోపిడీకి గురైంద‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌తిపాద‌న‌కు జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టులో నామినేష‌న్ ప‌ద్దతిపై వ‌చ్చిన న‌వ‌యుగ టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేశారు. అయితే, దీనిపై అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రంలో ఓ మీడియా నుంచి, ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.


ప్ర‌స్తుతం ఈ కేసు హైకోర్టులో విచార‌ణ ద‌శ‌లో ఉంది. అదే స‌మ‌యంలో ఇసుక విధానంలోనూ లోపాలు ఉన్నాయ‌ని భావించిన జ‌గ‌న్ అప్ప‌టికిప్పుడు ఇసుక రీచ్‌ల‌ను బంద్ చేశారు. దీంతో రాష్ట్రంలో ఇసుక పుట్ట‌ని విధంగా ప‌రిస్థితి మారిపోయింది. ఫ‌లితంగా ప‌నులు నిలిచిపోయి కూలీలు రోడ్డున ప‌డ్డారు. అయితే, తాము రూపొందించే విధానం అంద‌రికీ ఆమోద యోగ్యంగా ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ తాజాగా ఇసుక విధానాన్ని ప్ర‌క‌టించారు. శ‌నివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అందుబాటులోకి రానుంది. అదేస‌మ‌యంలో ఆశా వ‌ర్క‌ర్ల‌కు వేత‌న బ‌కాయిల విష‌యంలోనూ ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌మ‌యంలో స్పంద‌న రాక‌పోయే స‌రికి అది కూడా వివాదంగా మారింది.


ఇక‌, పేద‌ల‌కు అంతో ఇంతో ఉప‌యుక్తంగా మారిన అన్న క్యాంటీన్ల మూసి వేత మ‌రో ప్ర‌ధాన మైన‌స్‌గా మా రింది. నిజానికి ఈ క్యాంటీన్ల‌ను పూర్తిగా మూసి వేస్తామ‌ని జ‌గ‌న్ ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. దీనిపై అధ్యయ నం చేస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌తో స‌రికొత్త‌గా క్యాంటీన్ల‌ను ప్రారంభిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే, ఈ విష‌యంలో ప్ర‌భుత్వం సరైన స‌మ‌యంలో స్పందించ‌లేదు. దీంతో ఇప్ప‌టికీ ఇది వివాదంగానే ఉంది. ఇక‌, అమ‌రావ‌తి విష‌యంలోనూ ప్ర‌భుత్వం చిక్కుల్లో ప‌డింది. అమ‌రావ‌తిని ఇక్క‌డే కొన‌సాగిస్తామ‌ని కానీ, తీసివేస్తామ‌ని కానీ ప్ర‌భుత్వం చెప్ప‌క‌పోవ‌డంతో అన్ని పార్టీల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఇవి మిన‌హా.. రాష్ట్రంలో 100 రోజుల జ‌గ‌న్ పాల‌న‌కు ఎలాంటి ఇబ్బందులు రాలేద‌నే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: