ప్రజల కోసం చేసిన చట్టాలను ప్రస్తుతం పాలకులు తమ సొంతానికి వాడుకోవడం బాధాకరమని, అధికారంలో ఉన్న నాయకులు చట్టాలను పరిరక్షించాల్సిందిపోయి ఆ చట్టాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలకు వాడుకోవడం మరింత దారుణమని మాజీ మంత్రి, టీడీపీ నేత కెఎస్‌ జవహర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కోసం తీసుకొచ్చిన అట్రాసిటి చట్టాన్ని ఉండవల్లి శ్రీదేవి తన స్వలాభానికి వాడుకోవటాన్ని ఖండిస్తున్నామని జవహర్‌ వ్యాఖ్యానించారు. 

తనకు తానుగా ఒక ఎస్‌సిగా ప్రకటించుకొని నియోజవకర్గ ప్రజలను మోసం చేయడంతోపాటు దేవుడిని కూడా మోసం చేస్తున్నారని జవహర్‌ మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి పర్యటిస్తూ అనంతవరం గ్రామంలో వినాయక మండపంలో పూజలు చేసి వెళ్లిపోతున్న సమయంలో ఒక తండ్రి, కొడుకుల మధ్య జరిగిన వివాదంలో ఎమ్మెల్యే శ్రీదేవి తలదూర్చి గోటితో పోయే విషయాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని, తనకు సంబంధం లేని విషయాన్ని తనకు అనుగుణంగా మార్చుకొని ఇతరులపై ఎస్‌సి ఎస్‌టి ఆట్రాసిటి కేసు పెట్టి తమ రాజకీయ లబ్ది పొందడం బాధాకరమన్నారు. 


జరిగిన ఘటనను ఖండించాల్సిన ముఖ్యమంత్రి సైతం ఎమ్మెల్యే శ్రీదేవికి మద్దతివ్వడం శోచనీయమన్నారు. వాస్తవానికి అక్కడ ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందన్నట్లు బిల్డప్‌ ఇచ్చి విషయాన్ని పెద్దది చేశారన్నారు. ఇందులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ సైతం స్పందించడాన్ని చూస్తుంటే అసలు విషయాలు మరుగున పెట్టి ముందుకెళ్తున్నారు. దాన్ని నిజనిర్ధారణ కమిటిని ఏర్పాటు చేసి ఆ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు.  


తాను క్రైస్తవరాలినని ఓ ఇంటర్యూలో ప్రకటించుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసును ఏ విధంగా పెడతారని జవహర్‌ ప్రశ్నించారు. ఆమె క్రిష్టియన్‌ అయినప్పుడు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసు నమోదు కాదన్న విషయాన్ని తెలిసి కూడా టీడీపీపై బురదజల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 11, 1950 చట్టం ప్రకారం ఎవరైనా ఎస్‌సిలు తమ మతం మార్చుకుంటే వారు ఎస్‌సిల కింద పరిగణించబడరని చట్టంలో పేర్కొనడం జరిగిందన్నారు. 


మతం మార్చుకున్నవారికి ఎటువంటి ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కింద కేసులు నమోదు చేసుకునే అర్హత ఉండదని చట్టం చెబుతుందన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి దళితురాలే కానప్పుడు ఎస్‌సి, ఎస్‌టి కేసు ఏ విధంగా పెట్టారు? దాన్ని కేసుగా రాష్ట్ర పోలీసులు ఏ విధంగా పరిగణనలోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉండవల్లి శ్రీదేవి తన వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎస్‌సి, ఎస్‌టి చట్టాలను అడ్డు పెట్టుకుంటున్నట్లు తెలిపారు. 


ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీదేవిపై లీగల్‌ ఫోరం సభ్యులు కేసు వేయడం జరిగిందని ఎస్‌సి రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో ఏ విధంగా ఆమె పోటీ చేసిందో ఎలక్షన్‌ కమిషన్‌ చెప్పాలని ఫోరం సభ్యులు ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ త్వరలోనే విచారించి తగిన చర్యలు తీసుకుంటామని బదులివ్వడం జరిగిందని ఎస్‌సి రిజర్వ్‌డ్‌ స్థానంలో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే శ్రీదేవి ఎన్నిక చెల్లదు కాబట్టి ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని కోరారు. 


అవసరమైతే ఈ విషయంలో టీడీపీ కూడా లీగల్‌ ఫోరం సభ్యులుకు మద్దతుగా పోరాటం చేస్తుందని జవహర్‌ వెల్లడించారు. తన నియోజకవర్గంలోని తనకు ఓట్లు వేసిన ఓటర్లపైనే ఎమ్మెల్యే శ్రీదేవి కక్షకట్టడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని జవహర్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శ్రీదేవి విషయంలో స్పందించి ఆమెను అనర్హురాలిగా ప్రకటించి మళ్లీ ఒకసారి ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌సి రిజర్వ్‌డ్‌ స్థానాలను ఎస్‌సిలకే కేటాయిస్తూ అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని జవహర్‌ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: