అనంత‌పురం జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. ఇక్క‌డ త‌మ స‌త్తా చాటుతామ‌ని చెప్పిన నేత‌ల మ‌ధ్య ఆది నుంచి ఉన్న వైరం స‌ర్దు మ‌ణ‌గ‌క‌పోగా.. ఒక‌రి లూప్ లైన్ల‌ను మ‌రొక‌రు ఎత్తి చూపుకుంటూ.. పోలీసుల‌కు ఉప్పంది స్తూ.. వ్య‌క్తిగ‌త ద్వేషాల‌తో త‌మ‌ను తామే నాశ‌నం చేసుకుంటూ.. పార్టిని కూడా నాశ‌నం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ ఉనికి కూడా ప్ర‌శ్నార్థ‌క మ‌య్యే ప‌రిస్థితి క‌దిరిలో నెల‌కొంది. విష‌యంలోకి వెళ్తే.. 2009లో ఒక‌సారి టీడీపీ నుంచి విజ‌యం సాధించిన కందికుంట వెంక‌ట ప్ర‌సాద్‌.. త‌ర్వాత కాలంలో 2014లో ఓడిపోయారు. అప్ప‌ట్లో ఆయ‌న కేవ‌లం 800 పైచిలుకు ఓట్ల తేడాతోనే విజ‌యానికి దూర‌మ‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన అత్త‌ర్ చాంద్ బాషా విజ‌యం సాధించారు.


ఇద్ద‌రూ వేర్వేరే పార్టీల్లో ఉండ‌డంతో ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు కేసులు పెట్టుకున్నారు. టీడీపీ అధికారంలో ఉండ‌డంతో కందికుంట ఓడిపోయినా.. ఆయ‌న‌దే హ‌వా చ‌లామ‌ణి అయింది. అయితే, 2017లో టీడీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు.. ఆక‌ర్ష్ మంత్రం ప‌ఠించ‌డంతో అత్త‌ర్ చాంద్ బాషా వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలోకి చేరిపోయారు. నిజానికి ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌లేవ‌న్న మాట‌ను చంద్ర‌బాబు అబ‌ద్ధ‌మ‌ని నిరూపించాల‌ని ప్ర‌య‌త్నించినా.. ఈ ఇద్ద‌రు మాత్రం నిజ‌మ‌నే నిరూపించారు.


ఒకే పార్టీలో ఉన్నా.. ఒకే నియోజ‌క‌వ‌ర్గ‌మే అయినా.. అత్త‌ర్‌పై పైచేయి సాధించాల‌ని కందికుంట ప్ర‌య‌త్నించారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున వ‌చ్చే నిధుల‌ను నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా త‌న బ్యాంకు ఖాతాలోనే జ‌మ చేయించుకున్నారు. అయితే, ఎమ్మెల్యే అయిన త‌న‌కు తెలియ‌కుండానే, తాను టీడీపీలో చేరిన‌ప్ప‌టికీ.. త‌న‌ను ప‌ట్టించుకోకుండానే కందికుంట ఇలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో చాంద్ బాషా అనేక సార్లు చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆయ‌న స‌ర్ది చెప్ప‌డంతో కొన్నాళ్లు ర‌గ‌డ స‌ర్దు మ‌ణిగినా.. పూర్తిగా మాత్రం వివాదం స‌ర్దు మ‌ణ‌గ‌లేదు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఒకే పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ.. వైరం మాత్రం కొన‌సాగింది.


ఇక‌, ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్‌ను త‌న‌కు కాద‌ని, కందికుంట‌కు ఇవ్వ‌డంతో చాంద్ బాషా అలిగారు. అయితే, పార్టి అధికారంలోకి వ‌స్తే.. కీల‌క‌మైన ప‌ద‌వి ఇస్తామ‌ని చంద్ర‌బాబు ఆయ‌న‌కు హామీఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో చాంద్ బాషా పెద్ద‌గా ప‌నిచేయ‌లేదు.
దీంతో కందికుంట 2014లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. తెచ్చుకున్న ఓట్ల‌ను కూడా తాజా ఎన్నిక‌ల్లో తెచ్చుకోలేక పోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన సిద్దారెడ్డి 27 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈ ప‌రిణామం కందికుంట‌ను బాగా వేధించింది. త‌న ఓట‌మికి సొంత పార్టీ నాయ‌కులే కార‌ణ‌మంటూ ఆయ‌న బ‌హిరంగ వ్యాఖ్య‌లే చేశారు. క‌ట్ చేస్తే.. ఈ వైరం ఇంకా బ‌ల‌ప‌డింది.


ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం కందికుంట వెంక‌ట ప్ర‌సాద్‌కు ఉన్న ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీని వెన‌క్కి తీసుకుంది. దీంతో ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. తాను మాజీ ఎమ్మెల్యేన‌ని, త‌న ప్రాణ‌హాని ఉంద‌ని త‌న‌కు భ‌ద్ర‌త‌ను కొన‌సాగించాల‌ని కోరారు. అయితే, కోర్టు ఒప్పుకోలేదు. పైగా మీమీద 26 కేసులు కూడా ఉన్నాయ‌ని పేర్కొంటూ.. పిటిష‌న్ కొట్టివేసింది. అయితే, దీనిని చాంద్ బాషా స్వాగ‌తిస్తూ.. ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. అంద‌రికీ భ‌ద్ర‌త ఎందుకు? అంటూ వ్యాఖ్య‌లుచేశారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య మ‌రింత వైరం పెరిగింది. ప్ర‌స్తుతం ఇక్క‌డ చంద్ర‌బాబు ఎలాంటి పిలుపు ఇచ్చినా.. పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే నాధుడు కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఎలా ముందుకు వెళ్తారో.. ప‌రిస్థితిని ఎలా చ‌క్క‌దిద్దుతారో .. చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: