తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. నేత‌ల క‌ద‌లిక‌ల్లో తేడా వ‌స్తోంది. మాట‌లు వేడిపుట్టిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌లో రోజురోజుకూ ధిక్కార స్వ‌రాలు పెరుగుతున్నాయి. 2023 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ధ్యేయంగా క‌మ‌ల‌ద‌ళం దూసుకొస్తోంది. ఈ ప‌రిస్థితులు రాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు సామాన్య‌ప్ర‌జ‌ల్లోనూ ఆస‌క్తినిరేపుతున్నాయి. అయితే.. ఈ ప‌రిణామాల‌న్నీ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి క‌ష్టకాలం మొద‌లైంద‌నే సంకేతాల‌ను చూపుతున్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు.


అదేమిటోగానీ.. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన గులాబీద‌ళం.. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో మాత్రం దెబ్బ‌తిన్న‌ది.  కారు.. సారు.. ప‌ద‌హారు..నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లినా.. అనూహ్యంగా ప్ర‌తికూల ఫ‌లితాల‌ను చ‌విచూసింది. ఏకంగా నిజామాబాద్‌లో గులాబీద‌ళ‌ప‌తి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు క‌విత బీజేపీ అభ్య‌ర్థి అర్వింద్ చేతిలో ఓడిపోవ‌డంతో గులాబీశ్రేణులు కంగుతున్నాయి. ఇక అప్ప‌టి నుంచే తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌తికూల ప‌రిస్థితులు మొద‌ల‌య్యాయ‌ని చెప్పొచ్చు.


ప్ర‌ధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దూకుడు పెంచింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అంచ‌నాల‌కు అంద‌కుండా నాలుగు స్థానాల్లో సాధించిన విజ‌యంతో వ‌చ్చిన పాజిటివ్ వేవ్‌ను మ‌రింత పెంచుతూ దూసుకొస్తోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్శ్‌తో ఇత‌ర పార్టీల నేత‌ల‌ను కూడా లాగేస్తోంది. అయితే.. ఇన్నాళ్లూ ప్రాంతీయ‌వాదంతో తిరుగులేని శ‌క్తిగా ఎదిగిన గులాబీద‌ళం.. జాతీయ‌వాదంతో వ‌స్తున్న బీజేపీని ఎదుర్కొన‌డంలో మాత్రం విఫ‌లం చెందుతోంది. బీజేపీ విమ‌ర్శ‌ల‌ను దీటుగా తిప్పికొట్ట‌లేక‌పోతున్న‌ది.


ఇక్క‌డ మ‌రో కీల‌క మ‌లుపు ఏమిటంటే.. ఇటీవ‌ల తెలంగాణ‌కు నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్‌ను నియ‌మించింది కేంద్రం. ఇక ఇప్ప‌టి నుంచి తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు ఉంటాయ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ మ‌రో స‌మ‌స్య‌ను ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా గులాబీద‌ళంలో ధిక్కార స్వ‌రం వినిపిస్తోంది. ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీ అధిష్టానంపై ధిక్కార గ‌ళం వినిపిస్తున్నారు. మొన్న‌టికి మొన్న మంత్రి ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ప‌ద‌వి ఎవ‌రి భిక్ష కాద‌ని, గులాబీ ఓన‌ర్ల‌లో ఒక‌డిన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈట‌ల‌కు కొన‌సాగింపు మాన‌కొండూరు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ కూడా గురుపూజోత్స‌వం వేడుక‌ల్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


ఏకంగా ఆంద్ర‌ప్ర‌దేశ్ బోర్డులు బోయి తెలంగాణ బోర్డులు వ‌చ్చాయి త‌ప్ప ఏమీ మార‌లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. మ‌రికొంద‌రు నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మ‌రోవైపు.. యూరియా కొర‌త కూడా టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తోంది. యూరియా కోసం బారులు తీరుతున్నారు. క్యూలో నిల్చున్న రైతు గుండెపోటుతో మృతి చెంద‌డంపై ప్ర‌తిప‌క్షాలు టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఇక ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. అధికార టీఆర్ఎస్‌కు ముందుముందు మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్ప‌వ‌నే టాక్ వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: