తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగై పోయింది. ఏపీలోను ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఏప్రిల్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది. పలువురు కీల‌క నేత‌లు ఇప్పటికే పార్టీ మారిపోయారు. మరి కొందరు మారేందుకు సిద్ధంగా ఉన్నారు. లోకేష్ నాయకత్వంపై చాలామందికి నమ్మకం లేకపోవడంతో ప్రతి ఒక్కరూ తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఇత‌ర‌ పార్టీల వైపు చూస్తున్నారు. చంద్రబాబుతో పాటు ఆ పార్టీలో ఉన్న వారిలో చాలా మంది వయసు పైబడిన వారు కావడంతో పార్టీ అభిమానులు, కార్యకర్తలు... ఎప్పటినుంచో ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు.


ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు ఇస్తేనే మేలన్నది అభిమానులు... కార్యకర్తలు... రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సోషల్ మీడియాలో, మీడియాలోనూ ఎన్టీఆర్ ఎప్పుడూ హైలెట్ అవుతూనే ఉంటారు. ఇక ఎన్టీఆర్‌ను టిడిపి భవిష్యత్ వారసుడిగా చేసేందుకు అటు బాలయ్యకు.. చంద్రబాబుకు ఎంతమాత్రం ఇష్టం లేదన్న‌ది ఎప్పటినుంచో ఉంది. అందుకే ఎన్టీఆర్ తో చంద్రబాబు, బాలయ్య కుటుంబాలకు అంత సన్నిహిత సంబంధాలు లేవు అన్నది వాస్తవం. తాజాగా బాలకృష్ణ ఇద్దరూ అల్లుళ్లు చేసిన వ్యాఖ్యలు సైతం ఎన్టీఆర్ ను ఈ రెండు కుటుంబాలు పక్కన పెట్టేస్తున్నాయ‌న్న వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.


ఇటీవ‌ల వీరిద్ద‌రు చేసిన వ్యాఖ్య‌లు చూస్తే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం పార్టీకి పనిచేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఎన్టీఆర్ అవసరం పార్టీకేం లేదు’’ అని కామెంట్లు చేశారు. పోని అతనేదో తెలియక అన్నాడు అనుకుంటే..ఇక నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘టీడీపీ ఏ ఒకరి సొత్తు కాదు. ఇప్పుడున్న వాళ్లందరూ పార్టీ కోసం పనిచేసే వాళ్లే. ఎవరైనా వచ్చి పార్టీకి పనిచేయొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు’’ అని కామెంట్లు చేశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మాటల వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.


రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్ కొత్త ఏం కాదు. 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున జూనియర్ ప్రచారం చేశాడు. అప్పుడు ఎన్టీఆర్ ప్రసంగాలు టిడిపి కార్యకర్తల్లో మంచి ఉత్సాహం నింపాయి. అయితే ఎన్టీఆర్ మధ్యలో యాక్సిడెంట్ గాయంతో ప్రచారానికి దూరమయ్యాడు .ఆ ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనం ముందు టిడిపి ఓడిపోయింది. అయితే 92 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ నారా... నందమూరి కుటుంబాల‌కు పూర్తిగా దూరమయ్యాడు. గత ఏడాది ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మృతి తర్వాత ఈ రెండు కుటుంబాలు దగ్గరైనా కనిపించిన కూకట్‌ప‌ల్లి ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని బరిలో ఉండగా ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడని అందరూ అనుకున్నారు. ఆయ‌న మాత్రం రాజ‌కీయాల‌కు దూరం పాటిస్తూ సోషల్ మీడియాలో మాత్రమే ఆమెకు మద్దతు తెలిపాడు.


ఇక ఏపీలో జరిగిన ఎన్నికలలో అయినా ప్రచారం చేస్తాడని అందరూ అనుకుంటే అలా కూడా చేయలేదు. దీనికి తోడు ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ వస్తే ఈ రెండు కుటుంబాల‌కు కావాల్సిన లోకేష్ ఫ్యూచ‌ర్ డైల‌మాలోనే ఉంటుంది. అందుకే వీళ్ల‌కు ఎన్టీఆర్‌ను రాజ‌కీయంగా హైలెట్ చేయ‌డం ఇష్టం లేదు. అందుకే తోడ‌ళ్లుల్లు ఇద్ద‌రూ ఎన్టీఆర్ పార్టీకి అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా మాట్లాడార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: