పల్నాడు కేంద్రంగా చేసుకొని ఏపీ అధికార ప్రతిపక్షాలు రాజకీయం నడిపిస్తున్నాయి. పల్నాడులో పొలిటికల్ దాడులు హద్దు మీరాయని టీడీపీ ఏకంగా వైసీపీ బాధిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తే, అటు అధికార పార్టి కూడా పల్నాడు ప్రాంతలోని టీడీపీ బాధితులతో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసింది. 


గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాస కేంద్రం నడుపుతోంది టీడీపీ. వివిధ గ్రామాల్లోని  వైసీపీ బాధితులను తీసుకువచ్చి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ వ్యవహరం రాజధాని అమరావతిలో రసకందాయంగా మారింది. దీనిపై అధికార వైసీపీ నేతలు తీవ్ర స్దాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా సాగించిన దందాలపై కూడా ఇదే స్దాయిలో విచారణ అవసరం అంటూ వైసీపీ నేతలు సవాల్ మీద సవాల్ విసురుతున్నారు. 


తాజాగా టీడీపీ బాధితులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పిడుగురాళ్ళలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు వైసీపీ పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం పిడుగురాళ్ళ లో జరిగే సమావేశానికి టీడీపీ ప్రభుత్వ పాలనలో బాధితులుగా మారిన వారిని తీసుకువచ్చి టీడీపీ సాగించిన దందాలపై వివరాలను బహిర్గతం చేయబోతున్నారు. ఇదే సమావేశానికి మంత్రి సుచరిత కూడ హజరు కాబోతున్నారు. 


రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పల్నాడు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పల్నాడులో టీడీపీ నేతలపై వైసీపీ దాడులు, పరోక్షంగా పోలీసుల సహకారం ఉందని టీడీపీ పోలీసు శాఖను కూడా టార్గెట్ చేసింది. దీంతో పోలీసులు కూడా ఈ వ్యవహరాన్ని బహిరంగంగానే ఖండించారు.  గుంటూరులో వైసీపీ బాధితులతో టీడీపీ క్యాంపు నడుపుతుంటే, మరో పక్క పల్నాడులో వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ప్రభుత్వ పాలనలో బాధితులను వెలుగులోకి తీసుకురాబోతోంది. పోటాపోటీ శిబిరాలు ఎలాంటి పరిస్దితులకు దారితీస్తాయోనన్న ఉత్కంఠ  పల్నాడులో టెన్షన్ రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: