బండి తీసుకొని బయటకు వెళ్తున్నారా.. ! ఐతే ఒకటికి రెండుసార్లు లైసెన్స్‌, ఆర్సీ చెక్ చేసుకోండి..! హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించండి..! లేదంటే.. జేబు గుల్ల అవ్వాల్సిందే..! ఇతర రాష్ట్రాలతో పోలీస్తే తెలంగాణ, ఏపీలో భారీగా ఫైన్లు లేనప్పటికీ... తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఫైన్లు వేస్తున్నారు. 


కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. గీత దాటితే చాలు ముక్కుపిండి ఫైన్‌ వసూలు చేస్తున్నారు పోలీసులు. సిగ్నల్ క్రాస్ చేసినా, హెల్మెట్ లేకున్నా భారీగా ఫైన్‌ విధిస్తుండటంతో.. వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. బండి ధరకు మించి ఫైన్లు విధిస్తున్నారు. ఢిల్లీలో ఓ వ్యక్తి హెల్మెట్ ధరించలేదని 23వేల రుపాయలు ఫైన్‌ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆర్‌సీ, లైసెన్స్ చూపించలేదని మరో వ్యక్తి 23 వేలు జరిమానా వేశారు. అతడు సెకండ్ హ్యాండ్‌లో 15వేలకే బండి తీసుకున్నాడట. ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. 


పోలీసులకు సైతం ఈ బాధలు తప్పడం లేదు. జార్ఖండ్‌లో.. ఓ కానిస్టేబుల్‌ ఎస్సైతో కలిసి హెల్మెట్‌ లేకుండా దర్జాగా వెళ్లాడు. రాంఛీలో పోలీసులు తనిఖీ చేయగా... లైసెన్స్‌, పొల్యూషన్‌, ఇతర డాక్యూమెంట్లు కూడా లేవు. దీంతో వారికి డబుల్‌ ఫైన్‌ వేశారు. 17వేల రుపాయలకు.. 34వేలు విధించారు. ఎందుకంటే చట్టాన్ని రక్షించాల్సిన వాళ్లే అతిక్రమిస్తే... డబుల్‌ ఫైన్ విధించాలని కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ చెబుతున్నాయి. పోలీసులు ఐనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు ఉన్నతాధికారులు. 


భారీ జరిమానాలపైనా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధ్వాన్నంగా ఉన్న రోడ్లను బాగుచేసి ఫైన్‌లు వేయండంటూ సోషల్ మీడియాలో క్యాంపైన్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదే విషయంపై కన్నడ హీరోయిన్‌ శృతి రామకృష్ణ సీఎం యడియూరప్పకు విజ్ఞప్తి చేశారు. ఫైన్‌లు వేసే ముందు రోడ్లను నిర్మించండని, సామాన్యులు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో జరిమానాలు కడుతున్నారన్న విషయం గుర్తించుకోవాలని కోరారు శృతి. 


ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ప్రతీ వాహనదారుడు ఉల్లంఘనలకు తావ్వికుండా, అటు జేబుకు చిల్లు పడకుండా సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంచుకోవాల్సిన తరుణమిది. కొత్త మోటారు వాహనాల చట్టం తీసుకొచ్చిన కేంద్రం.. భారీగా జరిమానాల్ని వడ్డిస్తోంది. జరిమానా కట్టేస్తే ఏమీ కాదనే భావన వాహనదారుల్లో పెరిగిపోయిందని, అందుకే జరిమానాలు భారీగా పెంచామని అధికారులు చెబుతున్నారు. 


మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులు, సంరక్షకులకు పాతిక వేల జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. ప్రత్యామ్నాయ మార్గాల విషయంలో ట్రాఫిక్ పోలీసులు చెప్పింది వినకపోతే.. ఇప్పటివరకు 500 రూపాయల జరిమానా ఉండేది. ఇకపై 2 వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తారు. కాలం చెల్లి... ఉత్తుత్తి ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాలతో రాకపోకలు కొనసాగిస్తున్న ప్రజా రవాణా వాహనాలు, పాఠశాల వ్యాన్‌లు, బస్సులు, లారీలు, ఆటోలు, కార్ల యజమానుల నిర్లక్ష్య ధోరణి ఇకపై చెల్లదు. వాహనాల స్థితిగతులను పరిశీలించేందుకు వాటిని తయారుచేసిన సంస్థల, విడిభాగాలు అమర్చిన కంపెనీల ధ్రువీకరణ పత్రాలు వాహనంలో తప్పనిసరిగా ఉండాలి. వీటి ఆధారంగా కాలపరిమితి ముగిసిన వెంటనే విడిభాగాలను కొత్తవి వేసుకోవాలి. వీటన్నింటిని వాహన యజమానులు రవాణాశాఖ అధికారులను చూపించాలి.


మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ నియంత్రణ కోల్పోయినవారు ప్రమాదాలు చేస్తున్నారని గుర్తించిన రవాణాశాఖ, పోలీస్‌ అధికారులు ఏడేళ్ల నుంచి డ్రంకెన్‌డ్రైవ్‌ అమలు చేస్తున్నారు. తాగినట్టు తేలితే పది వేల రూపాయల జరిమానా ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా.. మోత మోగిపోతుంది. రోడ్లపై రేసింగులు చేస్తే.. 5 వేలు వసూలు చేస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా.. 5 వేలు కట్టాల్సిందే. కొత్త వాహన చట్టం చూడటానికి కఠినంగా కనిపిస్తున్నా.. దీని వల్ల చాలా లాభాలున్నాయంటున్నారు అధికారులు. భారీ జరిమానాలు పెట్టకపోతే.. వాహనదారుల్లో భయం ఉండదని చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోని కారణంగా చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని గుర్తుచేస్తున్నారు. జరిమానాలే కాదు.. రోడ్డు ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రులకు ఇచ్చే పరిహారం కూడా పెరగనుంది. ప్రస్తుతం హిట్‌అండ్‌ రన్‌లో చనిపోయినవారికి 25 వేలు, క్షతగాత్రులకు 12,500 నష్టపరిహారం ఇస్తున్నారు. ఇకపై చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు ఇస్తారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 11 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి. వాహన చోదకులకు విధించే జరిమానాలు ఏటా పది శాతం పెంచాలని కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: