ఏపీలో టీడీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోంది . కోడెల ఇప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయి ఉంటే యరపతినేని, కూన రవి కుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఇక తాజాగా యరపతినేని బాటలో చింతమనేని కూడా సాగుతున్నారు. చింతమనేనిపై కేసులు నమోదు అవుతున్న తరుణంలో చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్ళారు.పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. చింతమనేని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడంతో అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. చింతమేనేని పినకడిమి శివారులో ఎడ్లబళ్లపై ఇసుక తీసుకువెళుతున్న దళితులను అడ్డుకుని వారిని కులం పేరుతో దూషించారని దళితులు నిన్న ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇక ఇక్కడ దళితులు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మద్దతునిచ్చారు.


అటు శ్రీకాకుళం జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో కూన రవికుమార్ ఇంటికి వచ్చిన పోలీసులు.. సెర్చ్ చేస్తామని ఆయన భార్యను అడిగారు. అయితే వారెంట్ ఉంటేనే అనుమతిస్తామని ఆమె చెప్పడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కూన రవికుమార్ కేసు వ్యవహారంతో తనకు సంబంధం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. 


యరపతినేని అక్రమ మైనింగ్ కేసులో ఆయన మెడకు సీబీఐ దర్యాప్తు పేరుతో ఉచ్చు బిగుస్తున్న నేపధ్యంలో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించారనే ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ సైతం అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇక ఇప్పుడు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అజ్ఞాతంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: