ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాలలోని 1,26,728 ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం జులై నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 1 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు అభ్యర్థుల నుండి ఆన్ లైన్లో ధరఖాస్తులను స్వీకరించటం జరిగింది. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు గ్రామ సచివాలయ పరీక్షలు జరిగాయి. గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాలు ఈ నెల 20 వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో ఓఎంఆర్ జవాబు పత్రాలను స్కాన్ చేస్తున్నట్లు సమాచారం. అధికార వర్గాల సమాచారం ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువ పేపర్లు ఇప్పటికే స్కానింగ్ పూర్తయిందని తెలుస్తోంది. ఒక రోజుకు 4 లక్షల జవాబు పత్రాలను స్కాన్ చేసే సామర్థ్యం ఉన్న స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని జవాబు పత్రాలను పరీక్ష జరిగిన రోజే స్కానింగ్ కేంద్రానికి తీసుకొస్తున్నట్లు సమాచారం. 
 
ఇతర జిల్లాల నుండి మాత్రం జవాబు పత్రాలు మరుసటి రోజు వస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్ష ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని పది రోజుల్లో అధికారులు సిధ్ధం చేయబోతున్నట్లు తెలుస్తుంది. గ్రామసచివాలయ పరీక్షల కొరకు 21 లక్షల 69 వేల ధరఖాస్తులు రాగా 19,74,588 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయినట్లు తెలుస్తోంది. 
 
పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ల నుండి క్షేత్రస్థాయి ఉద్యోగుల వరకు అందరి సహకారంతో పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో, విజయవంతంగా పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అక్టోబర్ 2 వ తేదీ నాటికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి వారు విధుల్లో కూడా చేరిపోతారని అధికారులు చెబుతున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: