ఆయ‌న మాజీ స్పీక‌ర్‌.. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌.. ఎన్నిక‌ల ముందు అనూహ్యంగా గులాబీ గూటికి చేరి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి కూడా అంతే గంద‌ర‌గోళంగా త‌యారైంది. ఇప్పుడు ఆయ‌న అనుచ‌రులంద‌రూ.. అయ్య‌య్యో.. ఇలా అయిందేమిటి..? అని అనుకుంటున్నారు. ఇంత‌కీ ఆ మాజీ స్పీక‌ర్ ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..? ఆయ‌న మ‌రెవ‌రోకాదు.. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేశ్‌రెడ్డి. తాజాగా.. చేప‌ట్టిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆరుగురికి స్థానం ల‌భించింది. మ‌రికొంద‌రు కీల‌క నేత‌లకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.


కానీ.. అందులో సురేశ్‌రెడ్డి లేర‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది. ఇందులో ప్ర‌ధానంగా ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డికి శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ ప‌దవి ద‌క్క‌నుండ‌గా.. బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రైతు స‌మ‌న్వ‌య స‌మితి ఛైర్మ‌న్ కాబోతున్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహ‌రిని రాజ్య‌స‌భ ఇస్తామ‌ని హామీ ఇచ్చారట‌. ఇక తెలంగాణ తొలి స్పీక‌ర్‌ మ‌ధుసూద‌నచారి, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుల‌కు త్వ‌ర‌లోనే ఉన్న‌త ప‌ద‌వులు ఇవ్వాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు.


ఈ నేప‌థ్యంలో వీరంద‌రికీ తీపి క‌బురు వినిపిస్తార‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. అంతేగాకుండా.. ప‌లువురు నేత‌ల‌కు కార్పొరేష‌న్ల ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మాజీ మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కూడా ఉన్నతమైన పదవులిస్తార‌ని స‌మాచారం. ఇంత‌మంది పేర్లు వినిపిస్తున్నా.. అందులో మాత్రం మాజీ స్పీక‌ర్ సురేశ్‌రెడ్డి పేరు మాత్రం ఉండ‌డం లేదు. నిజానికి.. మొన్న‌టివ‌ర‌కు ఆయ‌న‌ను ఎమ్మెల్సీ చేస్తార‌ని అనుకున్నారు. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌నే టాక్ వినిపించింది. అదికూడా డౌటేన‌ని ప‌లువురు అంటున్నారు.


అయితే.. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ స్థానంలో సీఎం కేసీఆర్ కూతురు క‌విత ఓడిపోవ‌డంతో.. సురేశ్‌రెడ్డి క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌చారం జరుగుతోంది. సురేశ్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నార‌ని, ఆయ‌న అనుచ‌రులు కూడా గులాబీ పార్టీలో కొన‌సాగ‌డాన్ని ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌. ఈ నేప‌థ్యంలో సురేశ్‌రెడ్డి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి.



మరింత సమాచారం తెలుసుకోండి: