తెలంగాణ‌లో అస‌లు బీజేపీ ఎక్క‌డ ఉంది ?  బీజేపీ మాకు పోటీయే కాదు... మాకు పోటీ కాంగ్రెస్సే అని చెపుతోన్న టీఆర్ఎస్ నేత‌ల‌కు లోప‌ల మాత్రం బీజేపీ చాప‌కింద నీరులా దూసుకు వ‌స్తుండడం ఆందోళ‌న‌గానే ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత అస‌లు తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎక్క‌డ ఉన్నాయ‌ని ?  టీఆర్ఎస్ నేత‌లు ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీది తెలంగాణ‌లో గ‌తించిన చ‌రిత్ర అని ? అస‌లు ఆ పార్టీ టీడీపీలా భూస్థాపితం అవుతుందని సెటైర్లు వేశారు. క‌ట్ చేస్తే లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ఈ రెండు పార్టీలు పుంజుకున్నాయి. టీఆర్ఎస్‌కు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది.


కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లు గెలిస్తే.. బీజేపీ ఏకంగా ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా నాలుగు ఎంపీ సీట్లు గెల‌చుకుని టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. ఇందులో కేసీఆర్ కుమార్తె క‌విత‌ను బీజేపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర్వింద్ చిత్తు చిత్తుగా ఓడించారు. దీంతో టీఆర్ఎస్ నేతల క‌ళ్లు కింద‌కు దిగాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉత్త‌ర తెలంగాణ అంటే గులాబీ పార్టీకి కంచుకోటే. అలా గులాబీ పార్టీకి కంచుకోట‌గా ఉన్న నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ లాంటి చోట్ల కూడా కాషాయ జెండాను ఎగుర‌వేసింది.


ఈ విజ‌యం బీజేపీ నేత‌లే ఊహించ‌లేదు. దీంతో పార్టీ జాతీయ అధిష్టానం సైతం తెలంగాణ‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. ఈ క్ర‌మంలోనే పార్టీ జాతీయ నాయ‌క‌త్వం, ముఖ్యంగా అమిత్ షా సైతం తెలంగాణ‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. కేసీఆర్ సైతం బీజేపీ నేత‌ల ఎత్తుగ‌డ‌ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ఇక ఇటీవ‌ల ప్ర‌భుత్వం తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు, యాదాద్రి ఆల‌యంపై కేసీఆర్ బొమ్మ‌ల‌ను బీజేపీ బాగా వాడుకుని జ‌నాల్లోకి దూసుకు వెళుతోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీని నిలువ‌రించాల‌ని కేసీఆర్ వ్యూహాత్మంక‌గా పావులు క‌దుపుతున్నారు.


త‌న కుమార్తె ఓడిన నిజామాబాద్‌లో బీజేపీ దూకుడును అడ్డుక‌ట్ట వేసే బాధ్య‌త‌ను ఆమెకే అప్ప‌గించ‌గా ఆమె తిరిగి రంగంలోకి దిగుతున్నారు. ఇక టీఆర్ఎస్ కంచుకోట క‌రీంన‌గ‌ర్‌లో బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ దూకుడును అడ్డుకోవాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంట్ ప‌రిధిలోని క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్‌తోపాటు  సిరి సిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను మంత్రివ‌ర్గంలోకి తీసుకున్న‌ట్లు  తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇదే పార్ల‌మెంటు ప‌రిధిలో హుజూరాబాద్ నుంచి మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కూడా ఉన్నారు. అంటే ఇక్క‌డ బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు ఏకంగా ముగ్గురికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం అంటే మామూలు విష‌యం కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: