పెళ్లయి నెల తప్పగానే ఆ దంపతులు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటారు. పుట్టేది అబ్బాయో.. అమ్మాయో అంటూ లెక్కలు వేసుకుంటారు. పండంటి బాబు కావాలని తల్లి ఆశపడితే.. ముద్దులొలికే కూతురు కావాలని తండ్రి కలలు కంటాడు. తొలిసారి ఎవరి పుట్టినా ఓకే అనుకునే దంపతులు రెండో ఛాన్స్ వరకూ వచ్చేసరికి కండిషన్లు పెడతారు. ముందు అమ్మాయి పుడితే ఈసారి అమ్మాయి పుట్టాలని.. ముందు అబ్బాయి పుడితే... తర్వాత అమ్మాయి పుట్టాలని కోరుకుంటారు..


కానీ ఇక్కడే వస్తుంది అసలు చిక్కు.. ఇద్దరూ అబ్బాయిలే పుట్టినా.. ఇద్దరూ అమ్మాయిలే పుట్టినా.. నిరాశపడతారు.. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుడితే చాలా మంది ఓకే అనుకుని కుటుంబ నియంత్రణ చేస్తారు. కానీ.. అబ్బాయి కోసమో, అమ్మాయి కోసమే.. వరుసగా కనేవాళ్లు కొందరు ఉండేవారు. పాత కాలంలో ఇలాంటి వాళ్లు ఎక్కువ. ఇలాంటి ప్రయత్నాలన్నీ ఎక్కువగా అబ్బాయిల కోసం జరిగేవి.. అబ్బాయి కావాలని వరుసగా ఏడెనిమిది మంది అమ్మాయిలను కన్నవాళ్లూ ఉండేవాళ్లు.


కాలం మారి పోయింది. ఇప్పుడు అలా ఎవరు ఉంటున్నారు.. అంటారా.. అలాంటి వాళ్లు ఇప్పుడూ ఉన్నారు.. నమ్మకపోతే.. బ్రిటన్‌లోని అలెక్సిస్‌ బ్రెట్, డేవిడ్‌ బ్రెట్‌ అనే దంపతుల కథ వినండి... వీళ్లకు మొత్తం పది మంది సంతానం. అంతా మగపిల్లలే. ఎలాగైనా సరే ఆడపిల్ల కావాలని అలా కనుకుంటూ పోయారు. అలా అలా అలా మొత్తం పది మంది మగాళ్లను కన్నారు.


ఈ కాలంలో కూడా ఇదేం పని అంటూ చుట్టాలు పక్కాలు విసుక్కున్నా అమ్మాయి కావాల్సిందే అని పంతం పట్టారా దంపతులు.. మొత్తానికి వాళ్ల కోరిక ఇటీవలే తీరింది. ఈ ఆగస్టు 27న మరో బిడ్డకు జన్మ ఇచ్చారు. మొత్తానికి పదకొండో బిడ్డగా ఆడ శిశువు ఆ ఇంట అడుగు పెట్టింది. దాంతో వాళ్లు ఆనందమే ఆనందం. ఆ పాపకు కామరాన్‌ అనే పేరు పెట్టారు. ఈ జంట తమ పిల్లలందర్నీ వరుసగా నిలబెట్టి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి ఖుషీ అయ్యారు. ఇప్పుడీ ఫోటో తెగ వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: