రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాల తలరాత మార్చాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తరహాలో మూడేళ్లలో అన్ని కేంద్రాలను ఆధునీకరించాలని ఆదేశించారు.మహిళ శిశుసంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు ఆ శాఖ మంత్రి తానేటి వనిత, సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ స్కూళ్లలోపరిస్ధితిపై జగన్ తొలుత సమీక్షించారు. పాఠశాలల్లో చేరని విద్యార్థుల పై సీఎం వివరాలు అడిగారు. దాదాపు ఏడువేల మంది అంగన్‌వాడీల నుంచి స్కూళ్లలో చేరలేదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆరునెలల పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి తర్వాత వారి సామర్థ్యాలను బట్టి ఆయా తరగతుల్లో చేర్పించాలన్న సీఎం ఆదేశించారు. మిగతా పిల్లలతో సమానంగా రాణించేలా తగిన శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. అంగన్‌వాడీలపై ప్రత్యేక యాప్‌ తయారుచేయాలని సీఎం సూచించారు. పిల్లలకు అందుతున్న భోజనం, వారి సంరక్షణపై ఎప్పటికప్పుడు సమీక్షచేయాలని ఆదేశించారు.


అంగన్‌వాడీ వర్కర్లను ప్రోత్సహించాలని సీఎం సూచించారు. స్కూళ్ల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాలను బాగు చేయాలని సీఎం సూచించారు. అంగన్‌ వాడీ భవనాల సెంటర్ల స్థితిగతులపై పూర్తినివేదిక సిద్ధంచేయాలని ఆదేశించారు. స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు తరహాలో కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళిక తయారుచేయాలన్నారు. మూడేళ్లలో ఈ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఎన్నారైలు, సంస్థలు, దాతల సహాయం తీసుకుందామన్న జగన్ ఎవరు సహాయం చేసినా వారి పేర్లు పెడతామన్నారు. దీని కోసం పోర్టల్‌ రూపకల్పనకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కార్పొరేటు, వివిధ ప్రైవేటు సంస్థలకు పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. సీఎస్‌ఆర్‌ ద్వారా వారి భాగస్వామ్యానికి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమంలో గ్రామవాలంటీర్లకు కూడా భాగస్వామ్యం కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: