ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తర తెలంగాణ పొలిటికల్ గేట్ వే ఇక్కడ రాజకీయంగా పట్టు సాధించే వారే అధికారంలోకి వస్తారని పేరుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో కాంగ్రెస్ కు పట్టుంది. రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు కాంగ్రెస్ ఈ జిల్లాలో పై చేయి సాధించింది. కానీ గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. కాంగ్రెస్ నుంచి కీలక నేతలు ఎమ్మెల్సి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఈ ముగ్గురు నేతలు తమ తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఇప్పుడు ఒకే ఒక్క సీటుకు పరిమితం అయింది. మరి రాబోయే రోజుల్లో ఆ పార్టి జిల్లాలో బలోపేతమవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న.



కరీంనగర్ జిల్లాలో బిజెపికి పట్టుంది. విద్యాసాగరరావు ఇక్కడ నుంచే ఎంపీగా గెలిచారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ బీజేపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఎంపీ ఎన్నికలలో గెలుపుతో ఇక్కడ పాగా వేసేందుకు ఉమ్మడి జిల్లా పై కమలనాథులు ఫోకస్ పెట్టారు. నెలకొక కీలక నేత జిల్లాలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవాలని ప్లాన్ లు వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ అడ్డా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పన్నెండు సీట్లు టిఆర్ ఎస్ గెలిచింది. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల్లో పదకొండు సీట్లలో విజయం సాధించింది. రామగుండం నుంచి గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా ఆ తరవాత పార్టీలో చేరారు. మొత్తం పదమూడు సీట్లలో పన్నెండు సీట్లు గెలుస్తూ కారు పార్టీ తన హవా చాటుతోంది.



అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కారు కుదుపుకు గురైంది. కరీంనగర్ ఎంపీ సీటు కోల్పోవడంతో పాటు నిజామాబాద్ ఎంపి సీటు పరిధిలోని జగిత్యాల కోరుట్లలో కూడా పట్టు కోల్పొయింది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ హై కమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నాలుగు మంత్రి పదవులు కట్టబెట్టింది. ఇప్పటికే ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మంత్రులుగా కొనసాగుతుంటే తాజాగా కేటీఆర్, గంగుల కమలాకర్ కు అమాత్య పదవులు దక్కాయి. తమ అడ్డాలో ఇతర పార్టీలకు స్థానం లేకుండా చేయాలనే ఉద్దేశంతో నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని తెలుస్తోంది. మొత్తానికి ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ జిల్లాలో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాబోయే కాలంలో ఇక్కడ పార్టీల యాక్టివిటీస్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: