టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కని నేతలు ఆందోళనకు గురవుతున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పారని మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ నాయిని నరసింహరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కేసీఆర్ ను కోరానని మరోసారి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చారని చెప్పారు. తన అల్లుడు కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి కి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. అసెంబ్లీ లాబీలో విలేకరులతో చిట్ చాట్ చేసిన ఈ కార్పొరేషన్ పదవి ఇచ్చినా తీసుకోనని చెప్పారు. టీఆర్ ఎస్ లో ఉన్నోళ్లంతా పార్టీ ఓనర్ లేనని నాయిని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను మొదటివాడినని ఇప్పుడైతే కుటుంబానికి పెద్ద కేసీఆరే అని అన్నారు.


తామంతా ఇంటి ఓనర్లమేనని కిరాయిదారులు ఎంతకాలం అందులో ఉంటారనేది వాళ్ల ఇష్టమని అన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో పనులు జరగక పోవడం వల్ల తమ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉందన్నారు. అయితే హైదరాబాద్ లో బీజేపీ బలోపేతానికి పునాదుల్లేవన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు, కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ ఉందని నాయకత్వం లేకనే ఆ పార్టీ దెబ్బతిన్నదన్నారు. యాదాద్రిలో రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రాలూ కారు గుర్తు చెక్కడం తప్పేనని స్పష్టం చేశారు. చీఫ్ విప్ గా నియమితులైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మున్నూరు కాపు కోటాలో మంత్రి పదవిపై గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. అయితే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను అదృష్టం వరించింది. దీంతో వినయ్ భాస్కర్ తన అనుచరులు పార్టీ నేతల దగ్గర ఆవేదన వెల్లగక్కారని సమాచారం.



కమ్మ సామాజిక వర్గం కోటాలో హైదరాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తనకు మంత్రి పదవి దక్కుతుందనుకున్నారు. అయితే ఆయనకు విప్ పదవితో సరిపెట్టి అదే సామాజిక వర్గం నుంచి పువ్వాడ అజయ్ కు మంత్రి పదవి ఇచ్చారు. మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా మంత్రి పదవిపై చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే పదవి దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. బడ్జెట్ సమావేశాలకు ఆయన గైర్హాజరయ్యారు. సమావేశాల తేదీలు ముందే ఖరారైన పాల్గొనక పోవడం చర్చనీయాంశమైంది. ఆయన విదేశాలకు వెళ్లినట్లు మైనంపల్లి అనుచరులు చెబుతున్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిగిన రోజు మైనంపల్లిని ఆయన నివాసంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కలిసినట్టు సమాచారం.మాజీ మంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.


మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కకపోవటంతో అలిగారా, అజ్ఞాతంలోకి వెళ్లారా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. క్యాబినెట్ లో చోటు కల్పించలేకపోతున్నట్టు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి చెప్పడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తన ఇద్దరు గన్ మెన్ ను అక్కడే వదిలేసి హైదరాబాద్ నివాసం నుంచి మరో వాహనం లో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గన్ మెన్ వద్దని ఆదిలాబాద్ జిల్లా పోలీసు అధికారులకు చెప్పినట్టు సమాచారం. అయితే అనారోగ్యం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నారని రామన్న సన్నిహితులు చెబుతున్నారు.



కుటుంబ సభ్యులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు, జోగు రామన్నకు మంత్రి పదవి దక్కలేదన్న మనస్తాపంతో సాయిని రవి అనే కార్యకర్త ఒంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకున్నారు. క్యాబినెట్ కూర్పులో సామాజిక సమతూకం పాటించామని కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న మాదిగ సామాజిక వర్గానికి చోటు లేకుండా పోయిందని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పన్నెండు శాతం మాదిగలుంటే క్యాబినెట్ లో ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదని వాపోయారు. ఈ విషయంలో విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని ఎదురు దాడి చేస్తున్నారు కాని, ఎవరో ఒకరు మాట్లాడక తప్పదన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: