అనంతపురం జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతున్న బసివిని జోగినీ దురాచారం బయటపడింది.  పదకొండేళ్లు కూడా లేని బాలికలను బలవంతంగా జోగినిగా మార్చిన దారుణాన్ని బసివినిలపై కొనసాగుతున్న లైంగిక దోపిడీని అనగనగా ఒక ఊరు కార్యక్రమం ద్వారా వెలుగు లోకి వచ్చింది. జోగిని దురాచారం ఇప్పుడు లేదని బసివినీ వ్యవస్థ అంతరించి పోయిందని చెబుతూ వచ్చిన అధికారులు ఒ టీవీ చానల్ చేసిన కార్య క్రమంలో గ్రామ సభకు వచ్చిన వందలాది జోగిని, బసివిని, మాతంగి లను చూసి షాకయ్యారు.


సమాజంలో జోగిని బసివినిలు ఎదుర్కొంటున్న వివక్షను తండ్రి ఎవరో తెలియక వారి పిల్లలు ఎదుర్కొంటోన్న అవమానాలనూ చదువుకు కూడా దూరమవుతున్న వాస్తవ పరిస్థితులు వెలుగు లోకి వచ్చాయి. ఆచారం పేరుతో దళిత బిడ్డల్ని బసివిని జోగినిలుగా మారుస్తున్న వైనంపై ఓ టీవీ చానల్ ప్రచారం చేసిన అనగనగా ఒక ఊరు కార్యక్రమానికి అనంతపురం ఎస్పీ స్పందించారు. బాలికలను జోగిని బసివినిలుగా మారిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఎవరైనా సరే ఇటువంటి దురాచారాల్ని ఎంకరేజ్ చేసినా లేకపోతే ప్రమోట్ చేసినా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనీ అవసరమైతే పిడి యాక్టు పెట్టి డిటెన్షన్ కి పంపే ఆలోచన కూడా ఉంది అని ఎస్పీ అన్నారు.



జోగిని మాతంగి బసివిని దురాచారానికి మరెవ్వరూ బలికాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అనంతపురం ఎస్పీ. అలాగే ఇప్పటికే ఈ వ్యవస్థలో మగ్గుతోన్న మహిళలకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు. మహిళల రక్షణకు అనేక చట్టాలున్నాయని గుర్తు చేశారు. ఎక్కడా పొరబాటున కూడా ఇటువంటి వృత్తి లోకి రాకుండా లేకపోతే ఇటువంటి పరిస్థితులకు రాకుండా రివైండ్ చేసి ఎవేర్ నెస్ తీసుకు రావలసిన బాధ్యత మన మీద ఉంది అని అన్నారు. చట్టాలను అమలు చేయడంతో పాటు బాధితులు ఎక్కువగా ఉన్న కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఎస్పీ చెప్పారు. ఎన్జీవోలు మానసిక వైద్య నిపుణుల సాయంతో మూఢనమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.





మరింత సమాచారం తెలుసుకోండి: