చంద్రయాన్ 2 ప్రయోగం అనుకున్న లక్ష్యం చేరుకోని వేళ ప్రధాని మోడీ ప్రసంగం దేశంమంతటిలో స్ఫూర్తి నింపింది. ఇస్రో వెనుక మేమున్నామన్న భరోసా ఇచ్చింది. చంద్రయాన్ 2లో తలెత్తిన లోపంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన ఇస్రో ఛైర్మన్ ను ప్రధాని గుండెకు హత్తుకుని ఊరడించిన దృశ్యం మన కళ్ల ముందే ఉంది.


అయితే ఇంతలోనే ఈ షాకింగ్ వార్త అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అదేంటంటే.. ఇస్రో శాస్త్రవేత్తల జీతాల్లో కేంద్రం కోత విధించింది. ఈ చర్య వల్ల ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు తమ నెలవారీ జీతాల్లో దాదాపు రూ.10 వేలను కోల్పోవాల్సి వస్తోందని తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై స్పేస్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


దీని వివరాల్లోకి వెళ్తే... అంతరిక్ష పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న సీనియర్‌ స్టాఫ్‌ సభ్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ప్రభుత్వం కొన్నేళ్లుగా అడిషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తోంది. ఇది 1996 నుంచి ఇలాగే జరుగుతోంది. తాజాగా ఈ విధానం పై సమీక్షించిన కేంద్రం అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వరాదని నిర్ణయించింది. దీని వల్ల ఒక్కో సైంటిస్టుకు రూ. 10 వేల రూపాయల నష్టం వస్తుందని తెలుస్తోంది.


దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జూన్‌ 12న విడుదల చేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రభావంతో 90 శాతం మంది ఇస్రో ఉద్యోగుల వేతనాలు సగటున రూ.10వేల మేర తగ్గుతాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ఎంపి మోతీలాల్‌ ఓరా జులై 30న జరిగిన పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ప్రస్తావించారు కూడా. కేంద్ర ప్రభుత్వం మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. కేంద్ర ప్రభుత్వ చర్యను ఇస్రోలోని స్పేస్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల జీతాల్లో కోత విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: