దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ ఆలోచలను ఆచరణలో అసాధ్యమని రాజ్యాంగ నిపుణులు తేల్చేస్తున్నారు. ఎందుచేతనంటే అధికారం అనేది ఒక మత్తు మందు. అది ఒక్కరోజు కూడా వదులుకోవడానికి ఎవరూ ఒప్పుకోరు. ఇది మౌలిక సూత్రం. ఇక లోతుకు దిగితే ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ఇక్కడ ఎన్నో పార్టీలు, ఎన్నో మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. ఒక్క సీటు వచ్చిన వారు కూడా ప్రధాని, ముఖ్యమంత్రులు అయిన చరిత్ర ఉంది. ఈ దేశంలో మూడేళ్ల కాలంలో నాలుగు సార్లు లోక్ సభ ఎన్నికలు కూడా జరిగాయి.


రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే మెజారిటీ కలిగి ఉండాలి. కానీ నైతిక విలువలు లేని ఈ రోజుల్లో ఫిరాయింపులు సులువుగా జరుగుతున్నాయి. అపుడు ఆ సర్కార్ మైనారిటీలో పడితే అలాగే కొనసాగించి అయిదేళ్ళ కాలపరిమితి వరకూ ఎన్నికలు పెట్టరా. ఇక మెజారిటీ అసలు రాకపోతే ఎవరు పాలిస్తారు. అపుడు ఎన్నికలకు మళ్ళీ వెళ్ళడమే శరణ్యం.  అదే విధంగా ప్రజాస్వామ్యంలో ఎంత ఖర్చు అయినా సరే ప్రజల వద్దకు వెళ్ళి ఓటు తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. మెజారిటీ లేని పార్టీలను కూర్చోబెట్టి అయిదేళ్ళూ  పాలన చేయిస్తే జనం నుంచి వచ్చే రియాక్షన్లు వేరుగా ఉంటాయి. రాజ్యాంగపరంగా ఎన్నో అవరోధాలు జమిలి ఎన్నికలకు ఉన్నాయి.


ఇక అయిదేళ్ల అధికారం ఆరేళ్ళకు పెంచితే ఎవరైనా వూరుకుంటారు. మూడేళ్ళకు తగ్గిస్తే బీజేపీ ముఖ్యమంత్రులే ఎదురుతిరుగుతారు. ఇక ఏపీలో జమిలి ఎన్నికలు అని చంద్రబాబు ఉన్నపుడు అంటే మాకు వద్దు మేము అయిదేళ్ళు పాలిస్తామని తండ్రీ కొడుకులు బాబు, లోకేష్ చెప్పారు. మరి అదే ప్రజాస్వాయ్మ స్పూర్తి జగన్ విషయంలో బాబుకు ఎందుకు లేదు. ఆయన వెంటనే గద్దె దిగిపోవాలన్న బాబు ఆలోచన ప్రజాస్వామ్య సూత్రానికే తిలోదకాలు ఇచ్చేదిగా ఉంది.  అసలు జమిలి ఎన్నికలపై బాబు విధానం ఏంటి. ఆయన అధికారంలో ఉంటే వద్దు, ప్రతిపక్షంలో ఉంటే కావాలి. ఇదేం తీరు. సీనియర్ నేతగా చెప్పుకునే బాబుకు ఇంతటి సక్లిష్టమైన సమస్య విషయంలో ఒక అభిప్రాయం లేదా అన్నది ఇక్కడ చూడాలి.


ఇక జమిలి ఎన్నికలు మోడీ జరుపుతారో లేదో కూడా  ఈ  ఏడాదిలో జరిగే మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల  విషయం చూస్తే అర్ధమైపోతుంది.  వచ్చే ఏడాది నుంచి ఆర్ధిక మాంద్యం అంటున్నారు. రానున్న రోజులు కేంద్రంలోని  పాలకులకు గడ్డు రోజులు.  అవి ముందు పెట్టుకుని 2022 లో జమిలి ఎన్నికలకు వెళ్ళేంత తప్పుడు ఆలోచన మోడీ సర్కార్ చేయడ‌ని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. మొత్తానికి బాబు కలలు నిజం చేసేందుకు మోడీ సిధ్ధంగా లేరన్నది అర్ధమవుతోంది. అందువల్ల ఇప్పటినుంచే బాబు ఆయాసపడడం మానేసి అయిదేళ్ల ఎన్నికల కోసం  తాపీగా ప్రిపేర్ కావడం మంచిదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: