తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ సీజ‌న్‌ సంద‌ర్భంగా యూరియ కొర‌త సంద‌ర్భంగా తీవ్ర ఆందోళ‌న నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. రైతు మ‌ర‌ణించ‌డం...పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు..ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా ఇబ్బందుల పాలు చేశాయి. ఈ నేప‌థ్యంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. యాసంగి సీజన్‌కు అవసరమైన యూరియా అంచనాలను సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగి సాగు సమాచారాన్ని అన్నిజిల్లాల నుంచి సేకరించాలని చెప్పారు. ఈ నెల 11న ఢిల్లీలో జరుగనున్న కేంద్రప్రభుత్వ సమావేశంలో యాసంగికి అవసరమైన ఎరువుల అంచనాలపై నివేదిక అందజేయాలని సూచించారు. 


యూరియా అవ‌స‌రాల నేప‌థ్యంలో హైదరాబాద్‌లో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. యూరియా సరఫరా త్వరితగతిన సాగేందుకు పోర్టు ఇంచార్జి, రైల్వే ఇంచార్జిలతో మంత్రి సంప్రదింపులు జరిపారు. గంగవరం, వైజాగ్‌, ట్యుటికోరిన్‌, కాకినాడ, కరైకల్‌, కృష్ణపట్నం పోర్టుల నుంచి తెలంగాణకు వస్తున్న యూరియా సరఫరాపై ఆయన ఆరా తీశారు. గుజరాత్‌ హాజీరాలో క్రిభ్‌కో యూనిట్‌, చెన్నై మద్రాస్‌ ఫర్టిలైజర్స్‌ నుంచి తెలంగాణకు యూరియా చేరుతున్నట్టు నిరంజన్‌రెడ్డి తెలిపారు. అధికారులు జిల్లాల్లోని ప్రజాప్రతినిధులతో సంప్రదించి అదనపు అవసరాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు. సోమవారం నిజామాబాద్‌కు 2, మిర్యాలగూడ, కరీంనగర్‌, సనత్‌నగర్‌కు ఒక్కో రేక్‌ యూరియా చేరుకున్నదని ఆయన వెల్లడించారు. సెప్టెంబర్‌లో ఆదివారంనాటికి 64,485 టన్నుల యూరియా చేరుకున్నదని, 33,205 టన్నులు రవాణా మార్గంలో ఉన్నదని, 7,800 టన్నులు వివిధ పోర్టుల్లో రవాణాకు సిద్ధంగా ఉన్నదని వివరించారు. 


కాగా, యూరియా సరఫరాను వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి ఆదేశించారు. ఎరువుల డీలర్లతో సమీక్ష నిర్వహించారు. కంపెనీ నుంచి రావాల్సిన ఎరువులను డీలర్లు త్వరగా తెప్పించుకోవాలని పేర్కొంటూనే.. ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని పార్థసారథి హెచ్చరించారు. రాష్ర్టానికి రోడ్డుమార్గం ద్వారా 3,000 టన్నుల యూరియా అదనంగా చేరిందని, ఈ నెల 12 నాటికి 97,690 టన్నులు చేరుకుంటుందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: