రాష్ట్రలో రాజకీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే నడుస్తోంది. సిఎంగా ఉన్నపుడు సరే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర రాజకీయాలు తాను చెప్పినట్లే నడుచుకోవాలని చంద్రబాబు అనుకోవటంతోనే సమస్యలు వస్తున్నాయి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు ఎప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేస్తుంది. అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరమే లేదంటారు. ఏ అంశంపైనైనా ప్రతిపక్షాలతో మాట్లాడమంటే తాను చేతకాకపోతే కదా అఖిలపక్షంతో చర్చించాలని లా పాయింట్ లేవదీస్తారు.

 

అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని మాట్లాడనీయరు. పోని బయట మాట్లాడుదామంటే మీడియా సమావేశంలో తప్ప ఇంకెక్కడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఉద్యమాలు చేయాలన్నా అనుమతివ్వలేదు. పైగా  కొన్నిసార్లు అనుమతిచ్చి వెంటనే రద్దు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

 

ఇక జిల్లాల్లో తన పర్యటనల సందర్భంగా అప్పట్లో వైసిపి ఎంఎల్ఏలను, నేతలను ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారో లెక్కలేదు. వైసిపి నేతలు ఎటువంటి ఆందోళనలకు పిలుపివ్వకపోయినా సరే అరెస్టులు చేసేశారు. ఎందుకు అరెస్టులు చేస్తున్నారో చెప్పమని వైసిపి ఎంఎల్ఏలు ఎన్నిసార్లు ప్రశ్నించినా చంద్రబాబు ఏనాడూ సమాధానం చెప్పలేదు.

 

అదే చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులకు క్లాసులు పీకుతున్నారు. తమ నేతలను ఎందుకు హౌస్ అరెస్టులు చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. తాను అధికారంలో ఉన్నపుడు చేసిన పనులను బహుశా చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.

 

ప్రతిపక్షం విషయంలో అప్పట్లో చంద్రబాబు నడిచిన బాటలోనే ఇపుడు జగన్ కూడా వెళుతున్నారు. దాన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ప్రతీ యాక్షన్ కు ఓ రియాక్షన్ ఉంటుందన్న విషయాన్ని పాపం చంద్రబాబు, టిడిపి నేతలు మరచిపోయినట్లున్నారు. అప్పటి తమ యాక్షన్ కే ఇపుడు రియాక్షన్ కనిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: