రాను రాను ఆసుపత్రులకు వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరు వైద్యులు కమీషన్ కోసం అనవసరమైన మందులను రోగులకు అంటగడుతూ రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. చాలా ఆసుపత్రులలో ఆసుపత్రులే సొంతంగా మెడికల్ షాపులు నిర్వహిస్తూ పనికిరాని మందుల్ని ప్రజలు వాడేలా చేస్తున్నారు వైద్యులు. డాక్టర్లు రాసే మందులు ఆసుపత్రుల మెడికల్ షాపులలో తప్ప బయట ఎక్కడా దొరకవు. 
 
తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఆ ఆసుపత్రులలోనే కొనుగోలు చేయక తప్పదు. మందులు వేరే ఎక్కడా దొరకవు కాబట్టి అధిక ధరలకు అమ్మినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. కొన్ని కంపెనీలు నాసిరకం మందులను భారీ స్థాయిలో కమీషన్లు ఇస్తామని చెప్పి ఆ కంపెనీల ఆదాయాలను పెంచుకుంటున్నాయి. స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్ ల వద్ద కూడా ఈ కమీషన్ల కక్కుర్తి జరుగుతూనే ఉంది. 
 
కొన్ని ఏరియాలలో వైద్యులు కమీషన్ల కోసం ఏ మాత్రం సౌకర్యాలు సరిగ్గా లేని ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల వద్దకు పంపిస్తున్నారు. రోగి వ్యాధి నిర్ధారణ విషయంలో కూడా పొరపాట్లు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వైద్యలకు కమీషన్ లు ఇవ్వాలి కాబట్టి స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్ లు ప్రజల నుండి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 
 
ప్రభుత్వం రోగులకు మందుల ఖర్చును తగ్గించటం కోసం జనరిక్ మందులను ప్రవేశపెట్టటం జరిగింది. కానీ కొందరు వైద్యులు మాత్రం జనరిక్ మందులను అసలు రాయటమే లేదు. కొంతమంది ప్రజలు జనరిక్ మందులు రాయమని డాక్టర్లను అడిగినప్పటికీ అవి పనిచేయవని చెబుతున్నట్లు సమాచారం. ఎంసీఐ ఇప్పటికే మందుల కంపెనీల వద్ద కమీషన్ తీసుకుని రోగులకు మందులు ఇవ్వొద్దని, అటువంటి చర్యలను ఉపేక్షించమని హెచ్చరికలు కూడా జారీ చేసింది. కొన్ని పట్టణాల్లో నాలుగైదు జనరిక్ మందుల దుకాణాలు ఉన్నప్పటికీ వైద్యులు వీటి ఊసే ఎత్తటం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: